CAB కు వ్యతిరేకంగా మిన్నంటుతున్న ఆందోళనలు

By రాణి  Published on  19 Dec 2019 12:46 PM GMT
CAB కు వ్యతిరేకంగా మిన్నంటుతున్న ఆందోళనలు

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ లో విద్యార్థులు అరెస్ట్
  • దేశ రాజధానిలో నిరసనల హోరు
  • బెంగళూరు, యూపీలో ఆందోళన కారులపై లాఠీఛార్జ్

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశ పెట్టిన పౌరసత్వం బిల్లు (CAB)ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఇంతలో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి మొయినాబాద్ పీఎస్ కు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 50 మంది విద్యార్థులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలు చేస్తూ..వెంటనే క్యాబ్ ను వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు మాట్లాడుతూ..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళ్తున్న క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తుంటే ఇలా అక్రమ అరెస్ట్ లు చేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రాజధానిలో నిరసనల హోరు

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో సైతం నిరసనల హోరు ఆకాశాన్నంటుతోంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. అలాగే ప్రధాన రోడ్లు, కూడళ్లలో బారికేడ్లు పెట్టి భద్రతను కట్టుదిట్టం చేసి, వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. అలాగే ఢిల్లీలోని 19 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీ - గురుగ్రామ్ బోర్డర్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.



అయితే రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎయిర్ పోర్ట్ కు చేరేందుకు సులువైన మార్గాలను ఎంచుకోవాలని విమానయాన సంస్థ సూచిస్తోంది. ఈ మేరకు విస్తారా ఎయిర్ లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ ఇలా ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణికులతో పాటు మా విమానం సిబ్బంది కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఈ రోజు విమాన ప్రయాణాలు చేయవలసిన ప్రయాణికులకు ఉచితంగా టికెట్ కాన్సిల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు. మీ డబ్బు పూర్తిగా వాపసు వస్తుంది. అలాగే ఎవరైతే ఫ్లైట్ మిస్ అయ్యారో వారు దాని తర్వాతి ఫ్లైట్ లో ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాం.’







బెంగళూరు, యూపీలో ఆందోళన కారులపై లాఠీఛార్జ్

అలాగే పోలీసుల ఆంక్షలను తిరస్కరిస్తూ నిరసనల్లో పాల్గొన్న రాజకీయ, రాజకీయేతర ప్రముఖులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బెంగుళూరులో పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. బెంగళూరు, మంగళూరు, చెన్నై, తిరువనంతపురంలో సీఏఏ (Cab Amendment Act) వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. ప్రముఖ రచయిత రామచంద్ర గుహ సహా పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తమవుతుండటంతో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం.

యూపీ రాజధాని లక్నోలో క్యాబ్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు మితి మీరి హింసాకాండకు దారితీస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన కారులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి, పోలీస్ అవుట్ పోస్ట్ ను నేలమట్టం చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో..లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళన కారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

Next Story