పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, హింసాత్మక ఘటనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నా.. ఇంకా ఆందోళనలు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆందోళనకారులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసం సృష్టిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకు దిగుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వారి ఆస్తులను జప్తు చేస్తామని, జరిగిన నష్టాన్ని మొత్తం వారి నుంచి వసూలు చేస్తామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రంలోని లక్నో తదితర ప్రాంతాల్లో ఆందోళన కారులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఓ ప్రాంతంలో ఏకంగా పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం యోగిపై ఈ హెచ్చరికలు చేశారు.

సీసీటీవీ పుటేజీల ఆధారంగా  కేసులు:

పౌరసత్వ సవరణ పై జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో నిరసనల, ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. హింసకు పాల్పడిన వారి వీడియోలు తీశామని, సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి చెప్పారు. రాష్ట్రంలో నవంబర్‌ 8 నుంచి నిషేధాజ్ఞలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ఎలాంటి ప్రదర్శన నిర్వహించాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో.. విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలని ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.

కొన్ని పార్టీలు ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాయి:

రెచ్చగొట్టేవారి ముసుగులో ఆందోళనకారులు పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడ ఆందోళనలు జరిగినా.. సీసీటీవీల ద్వారా పరిశీలించి  బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును అందరు స్వాగతిస్తుండగా, కాంగ్రెస్‌, ఎస్పీ, మరి కొన్నిపార్టీలు జనాలు రెచ్చగొట్టేలా చేస్తున్నాయని, ఆందోళనలు,  నిరసనలు, హింసాత్మక ఘటనలకు దారి తీసేలా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై లేనిపోనివి సృష్టించి దాడులకు దిగేలా చేయడమే వారిపనిగా పెట్టుకున్నారని యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఆందోళనలో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాడులకు ప్రభుత్వ ఆస్తులపై దాడులకు తెగబడితే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా వ్యవహరించాలని సూచించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.