ఆ ఉరితాళ్లు ఎక్కడ తయారు చేస్తున్నారో తెలుసా..?
By సుభాష్ Published on 9 Dec 2019 2:44 PM GMTముఖ్యాంశాలు
అప్జల్ గురు ఉరితాడు తయారు చేసింది ఈ జైలు ఖైదీలే
ఉరితాళ్ల తయారీకి బక్సర్ జైలు ప్రసిద్ధి
నిర్భయ నిందితుల కోసం పది ఉరితాళ్లు సిద్ధం చేస్తున్న ఖైదీలు
2012, డిసెంబర్ 15న ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడనుంది. ఈనెల 16న ఉరిశిక్షను వేసేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు బీహార్‌లోని బుక్సర్ సెంట్రల్ జైలు అధికారులు ఆదేశాలు జారీ చేసింది. దోషులను ఉరి తీయడం కోసం బీహార్ రాష్ట్ర బుక్సర్ జైలు ఖైదీలు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9వతేదీన ఉరి తీశారు. అప్పుడు అఫ్జల్ గురును ఉరితీసేందుకు వినియోగించిన ఉరితాడును బుక్సర్ జైలు ఖైదీలే తయారు చేశారు. కాగా, బీహార్ రాష్ట్రంలోని గంగా నదీ తీరంలో ఉన్న బుక్సర్ సెంట్రల్ జైలు ఉరితాళ్ల తయారీలో ప్రసిద్ధి చెందింది.
పది ఉరితాళ్లు సిద్ధం:
జైలు సీనియర్ అధికారుల ఆదేశంతో నిర్భయ నిందితులను ఉరితీసేందుకు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నట్లు బుక్సర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా వెల్లడించారు. మూడు రోజుల క్రితమే ఉరితాళ్లు సిద్ధం చేయాలని బుక్సర్ జైలుకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏడుగురు ఖైదీలు నాలుగురోజుల పాటు శ్రమించి థ్రెడ్ తో కూడిన ఉరితాళ్లను పేనుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అఫ్జల్ గురు ఉరి కోసం ఉరితాళ్లు తయారు చేసిన ఖైదీలే నిర్భయ దోషుల ఉరి కోసం కూడా ఉరితాళ్లను తయారు చేసే పనిలో పడ్డారు.
అప్జల్ గురు కోసం తయారు చేసిన ఉరితాడు ధర 1725
గతంలో అఫ్జల్ గురు కోసం పేనిన ఉరితాడును 1725 రూపాయలకు తీహార్ జైలుకు విక్రయించారు. ప్రస్తుతం మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉరితాడు ధర కూడా పెరిగిందని బుక్సర్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు. ఉరి తీసే ఖైదీ ఎత్తు కంటే 1.6 రెట్లు పెద్ద ఉరితాడును తయారు చేస్తున్నామని ఓ జైలు అధికారి వెల్లడించారు.
ఉరి తాడు దేనితో తయారు చేస్తారంటే..
ఈ ఉరితాడు తయారీ కోసం థ్రెడ్‌ను గయ నగరంలోని మాన్పూర్ లోని వస్త్ర వ్యాపారుల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. గతంలో పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నుంచి ఉరితాడుకు థ్రెడ్ కొనుగోలు చేసేవారు.
ఉరితాళ్ల తయారికి బుక్సల్ జైలు ప్రసిద్ధి:
నిందితులను ఉరితీసేందుకు తయారు చేసే ఉరితాళ్లకు బుక్సర్ జైలు ప్రసిద్ధి.ఉరి శిక్ష విధించేటపుడు మనీలా ఉరితాడు ఫెయిల్ కాకుండ ఉంటుందట. 1930 వ సంవత్సరం నుంచి మనీలా బ్రాండ్ ఉరితాడును బుక్సర్ సెంట్రల్ జైలులోనే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. భాగల్ పూర్ సెంట్రల్ జైలులో 1992, 1995 సంవత్సరాల్లో ఉరిశిక్ష విధించినపుడు ఉరితాళ్లను బుక్సర్ జైలు నుంచి సరఫరా చేశారు. 2004వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం చేసిన దోషి ధనుంజయ్ చటర్జీని ఉరితీసినపుడు కూడా బుక్సర్ జైలు ఖైదీలు తయారు చేసిన ఉరి తాడునే ఉపయోగించారు. ఉరితాళ్లను ముందుగానే తాము తయారు చేసి, సకాలంలో తీహార్ జైలుకు అందించేలా చర్యలు చేపట్టామని జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ మిథిలేష్ మిశ్రా చెప్పారు.