దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డు.. తొలిసారి 80వేలు దాటిన సెన్సెక్స్

స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభాలతో ప్రారంభం అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 10:47 AM IST
stock market, all time record, sensex, nifty,

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డు.. తొలిసారి 80వేలు దాటిన సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు.. మన దేశీయ మార్కెట్లపైనా పడింది. దాంతో.. స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభాలతో ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఇంకా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇది కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో చరిత్ర సృస్టించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా 80వేల గరిష్ట మార్కును తాకింది.

ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్‌ సూచీ సెన్సెక్స్ ఆరంభంలోనే దాదాపు 500 పాయింట్లకుపైగా లాభపడి 80 వేల మార్కును తొలిసారి అధిగమించింది. 80,039.22 వద్ద 52 వారాల గరిష్ట విలువను, ఆల్ టైమ్ హై వాల్యూను నమోదు చేసింది. తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు భారీ లాభాల్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ దాదాపు 520 పాయింట్ల లాభంతో 79 వేల 690 పాయింట్ల ఎగునన ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా లాభాల్లోనే ఉంది. నిఫ్టీ 140 పాయింట్లకుపైగా పెరిగి 24 వేల 270 మార్కు పైన కొనసాగుతోంది. నిఫ్టీ కూడా బుధవారమే 24,292.15 వద్ద ఆల్ టైమ్ గరిష్ట విలువను నమోదు చేసింది.

మరోవైపు బ్యాంకింగ్ స్టాక్స్‌ కూడా లాభాల్లో దూసుకెళ్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్, కోటక్‌ మహీంద్ర, ఇండస్‌ ఇండ్ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయి. ఇక ఐటీ స్టాక్స్ నష్టాల్లో పడిపోయాయి. కిందటి సెషన్లో లాభంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర కూడా నష్టాల్లో కొనసాతున్నాయి.

Next Story