పగలు సీఈవోగా.. రాత్రుళ్లు క్యాబ్ డ్రైవర్‌గా చేశా: ఓలా క్యాబ్స్ సీఈవో
ఏదైనా బిజినెస్ పెడితే అందులో రాణించడం చాలా కష్టమైన పనే. అలాగే దానిని ముందుకు తీసుకెళ్లడం కూడా అంత సులువైనది కాదు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 3:15 PM ISTపగలు సీఈవోగా.. రాత్రుళ్లు క్యాబ్ డ్రైవర్‌గా చేశా: ఓలా క్యాబ్స్ సీఈవో
ఏదైనా బిజినెస్ పెడితే అందులో రాణించడం చాలా కష్టమైన పనే. అలాగే దానిని ముందుకు తీసుకెళ్లడం కూడా అంత సులువైనది కాదు. వినియోగదారులు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా వారికి అందించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే బిజినెస్‌లో రాణించగలరు. అయితే.. ఇదే ఫార్ములాను ప్రారంభించారు ఓలా క్యాబ్స్ సీఈవో హేమంత్ భక్షి. రాత్రుళ్లు క్యాబ్ డ్రైవర్‌గా చేస్తూ కస్టమర్ల అభిరుచులను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఈవో హేమంత్ భక్షినే వెల్లడించారు.
ఓలా క్యాబ్స్‌కు కొత్త సీఈవోగా హేమంత్ భక్షిని మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ నియమించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆయన యూనిలీవర్ ఇండోనేషియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐటీ - బాంబే పూర్వ విద్యార్థి అయిన హేమంత్ భక్షి నాలుగు నెలల కిందట ఓలాలో చేరారు. దాంతో.. సమర్దుడైన భక్షికి ఓలా క్యాబ్స్ సీఈవో బాధ్యతలను అప్పగించారు.
ఓలా త్రైమాసిక ఫలితాలను వెల్లడించారు కొత్త సీఈవో హేమంత్ భక్షి. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్యాబ్ డ్రైవర్‌గాను తాను అవతారం ఎత్తిన విషయాన్ని పంచుకున్నారు. వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారాంతాల్లో బెంగళూరు వీధుల్లో రాత్రి పూట క్యాబ్ నడిపానని చెప్పారు. అనుభవపూర్వకంగా వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేశానని అన్నారు. స్వయంగా తెలుసుకోవడానికి మించి ఏదీ ఉండదని చెప్పారు. అందుకే మూన్‌లైటింగ్ చేశానని అన్నారు. గతంలో ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి సైతం కొన్ని నెలల పాటు ఉబర్ డ్రైవర్‌గా.. డెలివరీ ఏజెంట్‌గా చేశానని.. తద్వారా వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నానని ఓ సందర్భంలో వెల్లడించారు.