మస్క్‌ మరో కీలక నిర్ణయం..ట్విట్టర్‌లో ఇక 'వ్యూ లిమిట్'

ట్వీట్స్‌ చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించినట్లు ఎలాన్‌ మస్క్‌ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  2 July 2023 2:36 PM IST
Elon musk, Twitter, View limit

మస్క్‌ మరో కీలక నిర్ణయం..ట్విట్టర్‌లో ఇక 'వ్యూ లిమిట్'

ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్లూటిక్‌ కోసం డబ్బులు చెల్లించడం, ఉద్యోగుల తొలగింపు ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు ఎలాన్‌ మస్క్. ట్వీట్స్‌ చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించినట్లు ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్, కొత్త అన్‌వెరిఫైడ్‌ ఖాతాదారులకు వేర్వేరుగా వ్యూ లిమిట్‌ ఉంటుందని పేర్కొన్నారు.

ట్విట్టర్‌ సేవల్లో జూలై 1 నుంచి అంతరాయం ఏర్పడింది. దీంతో.. యూజర్లు ఏమైందో తెలియక అయోమయంలో పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ యూజర్లు ట్వీట్లను యాక్సెస్‌ చేయలేకపోయారు. యాప్‌లో అంతరాయం ఏర్పడిందని పలువురు కంప్లైంట్‌ కూడా చేశారు. ట్విట్టర్‌ ఓపెన్‌ చేస్తుంటే ‘కెనాట్‌ రీట్రైవ్‌ ట్వీట్స్‌’ ‘రేట్‌ లిమిట్‌ ఎక్సీడెడ్‌’ వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయని తమతమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దాంతో.. ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్వీట్ల వీక్షణలో అంతరాయంపై వివరణ ఇచ్చారు. డేటా స్క్రాపింగ్, సిస్టమ్‌ మానిప్యులేషన్ల సమస్యలను పరిష్కరించేందుకు తాత్కాలిక పరిమితులను తీసుకొచ్చినట్లు ముందు ఒక ట్వీట్‌ చేశారు. యూజర్లు ట్విట్టర్‌కు బానిసయ్యే అవకాశాలు ఉన్నాయని.. దాని నుంచి బయటపడాల్సిన అవసరముందని రాసుకొచ్చారు. ఆయన ప్రపంచానికి మంచి చేస్తున్నానని చెబుతూ ట్వీట్‌ చేశారు.

ట్విట్టర్‌లో రోజూ వీక్షణ పోస్టుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు తెలిపారు ఎలాన్ మస్క్. వెరిఫైడ్‌ అకౌంట్‌ వారు 6వేల పోస్టులు, అన్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌ వారు 600 పోస్టులు, కొత్త అన్‌ వెరిఫైడ్‌ ఖాతాదారులు 300 వరకు పోస్టులు వీక్షించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో పరిమితిని పెంచనున్నట్లు తెలిపారు ఎలాన్ మస్క్. శనివారం నుంచి ట్విట్ర్‌ సేవలకు అంతరాయం కలగడంతో #twitterdown ను యూజర్లు ట్రెండ్‌ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మస్క్‌ అనూహ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Next Story