SBI కస్టమర్లకు అలర్ట్.. డెబిట్ కార్డుల చార్జీలు పెంపు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 9:45 AM GMTSBI కస్టమర్లకు అలర్ట్.. డెబిట్ కార్డుల చార్జీలు పెంపు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. తమ డెబిట్ కార్డు నిర్వహణ చార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. గరిష్టంగా రూ.75 వరకు పెంచినట్లు పేర్కొంది. ఈ చార్జీలకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. దాంతో.. డెబిట్ కార్డుల చార్జీలు అమౌంట్ మరింత పెరగనుంది. అయితే.. ఈ పెంచిన డెబిట్ కార్డు చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ బ్యాంకు తెలిపింది.
ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డులను అందిస్తోంది. వాటికి అనుగుణంగా వార్షిక నిర్వహణ ఫీజును వసూలు చేస్తోంది ఎస్‌ఐబీ. ఈ మేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ఉంది. జీఎస్టీ అదనంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి రూ. 200 రుసుముతో పాటుగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది ఎస్‌బీఐ. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు చార్జీని రూ.250 నుంచి రూ.325కి పెంచారు. ప్రైడ్, ప్రీఇయం బిజినెస్ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ చార్జీలను వసూలు చేస్తున్నారు. దాన్ని రూ.425కి పెంచింది ఎస్‌బీఐ బ్యాంకు. కాగా.. ఈ చార్జీలన్నింటికీ కూడా అదనంగా జీఎస్టీని జతచేసి వసూలు చేయనుంది ఎస్‌బీఐ బ్యాంకు.