నేడే బడ్జెట్ 2023.. కోటి ఆశలు.. పేద, మధ్యతరగతి వేతన జీవుల ఆశలు నెరవేరేనా..?
Nirmala Sitharaman will present the Union Budget 2023 today.ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్
By తోట వంశీ కుమార్
పేద, మధ్యతరగతి, ఉద్యోగులు మొదలుకొని ఆర్థిక రంగ నిపుణులు, పరిశ్రమ వర్గాలు అందరూ ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త బయటపడ్డాం అనే ఆలోచనలు వస్తుండగానే ఉక్రెయిన్-రష్యా యుద్దం రూపంలో మరో పిడుగు నెత్తిన పడగా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాందోళనల మధ్య ఉద్యోగాత కోత మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే కానుంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారా? లేకుంటే జనాకర్షణకు పట్టం కడతారా అనే ఆసక్తి నెలకొంది. గత రెండేళ్లుగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఈ సారి కూడా అలాగే ఉండనుంది.
ఇక సామాన్యుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరి చూపు బడ్జెట్‌పైనే ఉంది. ఓ వైపు పెరుగుతున్న ధరలతో కుటుంబ పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ పన్నుల విషయంలో తీవ్ర నిరాశే మిగులుతోంది. కనీసం ఈ సారైనా ఊరట దక్కుతుందా..? లేదా అన్నది చూడాలి. ఒకవేళ పన్నులు శ్లాబులు తగ్గించకపోయినా ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చేలా 80 సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలు ఉండవచ్చునని అంటున్నారు.
గృహ రుణ రేట్లను తగ్గించాలని పలువురు కోరుతుండగా, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులతో పాటు మురికివాడల పునరావాస పథకాలు, పెట్టుబడులపై దృష్టి సారించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక వార్షికాదాయం రూ.5 నుంచి రూ.10లక్షల మధ్య ఉన్న వర్గంపై ద్రవ్యోల్భణ భారం భారీగానే ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం ఈ సారి బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది.
మొత్తంగా అన్ని రంగాలు బడ్జెట్‌పై భారీ ఆశలే పెట్టుకున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడంతో అన్ని రంగాలు సంతృప్తి పరుస్తూ దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించే లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేల్లా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతుందా..? లేదా..? అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది.