రేపట్నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యేకతలివే..
బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 1:10 PM ISTరేపట్నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యేకతలివే..
బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. దాంతో.. ఈ బడ్జెట్ పార్లమెంట్ సెషన్ మొదలు అవుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రదిపాదిస్తారు. ఇక ఎన్నికల నేపథ్యం విధానపర ప్రకటన కూడా ఏమీ ఉండే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024,-25 ఏడాదికి జూన్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ఐదుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. అయితే.. వరుసగా ఆరోసారి బడ్జెట్ సమర్పించిన మహిళా నేతగా నిర్మలాసీతారామన్ రికార్డు సృష్టించారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి స్థానంలో ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ నిలుస్తున్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో అరుణ్‌జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్ ప్రతిపాదించిన మహిళా నేత నిర్మలా సీతారామనే.
కాగా.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడింది. అప్పుడు అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి వరుసగా ఐదేళ్ల పాటు 2018-19 వరకు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురికావడంతో 2019-2020 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఆ అవకాశాన్ని పీయూష్ గోయల్‌కు అందింది. 2019లో కూడా మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వమే ఏర్పడింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారమన్ బాధ్యతలు తీసుకున్నారు. అలా వరుసగా నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాన్ని అందిపుచుకున్నారు. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో రెండో నేతగా నిలిచారు నిర్మల. ఇక సూట్‌కేసులా కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపురంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయానికి కూడా నిర్మలసీతారామనే శ్రీకారం చుట్టారు.