భారత్ ముందంజలో ఉంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
By సుభాష్
అంతర్జాతీయ ర్యాకింగ్‌లోనూ భారత్ ముందంజలో ఉందని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి ఆయన మాట్లడారు. నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ దశాబ్దం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం చారిత్రాత్మకమని, అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు సమకూర్చామని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని, ఈ ఏడాదిలో కొత్తగా మరో 75 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామని అన్నారు.
గత సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మరో వైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.