ఏజెన్సీలో కలకలం రేపుతున్న బ్రదర్ అనిల్ మత ప్రచార సదస్సు
By రాణి Published on 4 Feb 2020 3:33 PM ISTమత ప్రచారం. ఇప్పుడు ఇది విశాఖ ఏజెన్సీలో కలకలం రేపుతోంది. దైవ సేవకుల సదస్సుల పేరుతో అక్కడి ప్రజలచే మతం మార్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం పాడేరు ఏజెన్సీలో బ్రదర్ అనిల్ కుమార్, క్రైస్తవ మత ప్రచారకులు దైవ సేవకుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన క్రైస్తవ మత బోధకులు, పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు శక్తి, సామర్థ్యాలను బ్రదర్ అనిల్ కుమార్ వారికి వివరించారు. ఈ మత ప్రచార సదస్సుకు వందల సంఖ్యలో పాస్టర్లు హాజరైనట్లు తెలుస్తోంది. సదస్సుకు హాజరైన పాస్టర్లంతా ఏజెన్సీలో ఉంటున్న ప్రజలచే మతమార్పిడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి.
బ్రదర్ అనిల్ కుమార్ ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బావ. జగన్ సోదరి షర్మిల భర్త అనిల్ కుమార్. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో బ్రదర్ అనిల్ కుమార్ సదస్సు తర్వాత మతమార్పిళ్లు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రదేశాల్లో మత పెద్దలు బాప్తీశం స్వీకరించే వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏజెన్సీలో నివసిస్తున్న అమాయక ప్రజలను టార్గెట్ చేసి కొందరు వ్యక్తులు సేవ పేరుతో మతాలను మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని కొందరు చెప్తున్న మాటలు. ఇలా చిన్న చిన్నగా సదస్సులు మొదలు పెట్టి..కొన్నాళ్లకు రాష్ర్ట వ్యాప్తంగా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల మతాన్ని మార్చేలా ప్రచారం చేయడమే మత బోధకుల ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన 8 నెలల్లోనే తిరుమలలో రెండుసార్లు మత ప్రచారం జరిగిందని వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. తిరుపతిలోని ఒక ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న చెట్లపై డిసెంబర్ 24వ తేదీ గుర్తుతెలియని వ్యక్తులు తమ మతానికి సంబంధించిన గుర్తులను వేశారు. ఇదంతా రాత్రి సమయంలో జరగడంతో అలాచేసిన వ్యక్తులెవరో గుర్తించలేకపోయారు.