షాకింగ్‌: మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు: బ్రిటన్‌ ప్రధాని

By సుభాష్  Published on  11 May 2020 12:11 PM IST
షాకింగ్‌: మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు: బ్రిటన్‌ ప్రధాని

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా దాదాపు 200లకుపైగా దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌ బారిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక బ్రిటన్‌లో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకూ 219,183 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను జూన్‌ 1వ తేదీ వరకూ పొడిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేసేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

కరోనా వ్యాధి అధికంగా ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ ముగించడం అంత మంచిది కాదని, అందువల్లనే లాక్‌డౌన్‌ నిర్ణయం పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని బ్రిటన్‌ ప్రధాని తెలిపారు. ఏది ఏమైనా జూన్‌ 1 నుంచి కొన్ని పాఠశాలలు, దుకాణాలు తెరుచుకుంటాయన్నారు.

ఇక జనాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మాత్రం జూలై 1 తర్వాతనే అనుమతి ఇస్తామన్నారు. అటు విదేశాల నుంచి ఎవరైనా బ్రిటన్‌ వచ్చినట్లయితే వారు తప్పకుండా క్వారంటైన్ నియమాలు పాటించాలని స్పష్టం చేశారు.

అలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయలేని వారు కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించుకోవచ్చని ప్రకటించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ఆదేశించారు. బ్రిటన్‌తోపాటు వేల్స్‌, స్కాట్లాండ్‌ దేశాలలో కూడా లాక్‌డౌన్‌ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. 'స్టే ఎట్‌ హోం' అనే నినాదంతో పాటు 'స్టే సేప్టీ' నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రధాని సూచించారు.

అలాగే జూన్‌ మొదటి వారంలోపు పరిస్థితి అదుపులోకి వస్తే పాఠశాలలు, ఆస్పత్రుల్లో ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఇక భారత్‌లో కూడా ఈనెల 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ పొడిగించాలా..? వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు, కరోనా కేసుల సంఖ్య తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొన్ని రాష్ట్రాల్లో మినహా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

Next Story