లాక్‌డౌన్ ఎఫెక్ట్: వధూవరులతో పాటు 50 మంది అరెస్ట్
By సుభాష్
ప్రస్తుతం కరోనా పేరు వింటేనే వణికిపోతున్నాము. ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక దీనిని కట్టడి చేసేందుకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఎవ్వరు కూడా బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికాలో కూడా లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతోంది. ఇక దక్షిణాఫ్రికాలో కరోనా పాజిటివ్ కేసులు 1850 ఉండగా, ఇప్పటి వరకు 18 వరకు ప్రాణాలు కోల్పోయారు.
గత నాలుగు రోజుల కిందట కేప్ టౌన్ నగరంలో ఓ నూతన జంటకు వివాహం జరిగింది. మత పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా చర్చిలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి సుమారు 50 మంది అతిథులు హాజరయ్యారు. ఇక కరోనా వేళ లాక్ డౌన్ అమల్లో ఉన్నందున నిబంధనలు అతిక్రమించడం నేరమని కొందరు పోలీసులకు సమాచారం అందించారట. ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో పెళ్లికి వచ్చినవారంతా భయంతో పరుగులుపెట్టారు.
కాగా, కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ ఉన్నందున పెళ్లి కూతురు, కుమారుడితో పాటు వివాహానికి వచ్చిన 50 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. లాక్ డౌన్ సమయంలో ఎవరూ రూల్స్ బ్రేక్ చేసినా కఠిన చర్యలు తప్పవని అధకారులు హెచ్చరిస్తన్నారు