లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే రూ. 23వేల జరిమానా!
By సుభాష్ Published on 22 April 2020 8:18 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు సింగపూర్‌లో జూన్ 1వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అక్కడ మంగళవారం ఒక్క రోజే 1111 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,125కు చేరుకుంది. కానీ సింగపూర్‌లో కరోనా మరణాలు తక్కువే ఉన్నా.. పాజిటివ్ కేసులు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఇక తాజాగా కరోనా కేసులు మరింత పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కఠినతరం చేస్తున్నారు అధికారులు. అత్యవసర సేవలు మినహా అన్నింటిని బంద్ చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ డిస్టెన్స్‌ను పాటించకుండా 10 మందికి మించి గుమిగూడినట్లయితే రూ. 23వేల జరిమానా విధించేందుకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వం. కరోనా కట్టడిలో భాగంగా ఈ కొత్త నిర్ణయంతో జనాలు కట్టడిలో ఉంటారనేది ప్రభుత్వ ఆలోచన.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచ వ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ 2,560,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 177,718 మంది మృతి చెందారు. ఇక 696,232 మంది కరోనా నుంచి కోలుకున్నారు.