భారత అమ్ములపొదిలో బలమైన అస్త్రాలు బ్రహ్మాస్, సుఖోయ్

By రాణి  Published on  20 Jan 2020 6:57 AM GMT
భారత అమ్ములపొదిలో బలమైన అస్త్రాలు బ్రహ్మాస్, సుఖోయ్

ముఖ్యాంశాలు

  • సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన భారత్
  • కనీవినీ ఎరుగని స్థాయిలో రక్షణ ఏర్పాట్లు
  • సుఖోయ్ లతో తంజావూరులో కొత్త స్క్వాడ్రన్
  • కొత్త స్క్వాడ్రన్ నిక్ నేమ్ టైగర్ షార్క్స్
  • సుఖోయ్ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణులు
  • అణువణువూ జల్లెడపడుతున్న సుఖోయ్ లు
  • భారత్ రక్షణ వ్యవస్థను చూసి భయపడుతున్న చైనా

చైనా పై పెద్ద ఎత్తున కన్నేసి ఉంచేందుకు భారతీయ రక్షణ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మన అమ్ములపొదిలో ఉన్న అత్యాధునికమైన అస్త్రాలను సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా పరోక్షంగా చైనాకు భయాన్ని కలిగించే ఆలోచన గట్టిగా చేస్తోంది. బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఇండియన్ ఓషన్ లో టైగర్ షార్క్ లను చైనా ఆపరేషన్స్ ని పట్టించే ఇన్ఫార్మర్లుగా వాడుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

సూపర్ సానిక్ బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లగలిగే సుఖోయ్ యుద్ధ విమానాలను తమిళనాడులోని తంజావూరు ఎయిర్ బేస్ లో భారీగా మోహరించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ స్క్వాడ్రన్ ఇకపై పూర్తి స్థాయిలో సరిహద్దుల్లో గస్తీ తిరిగేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఈ స్క్వాడ్రన్ కి టైగర్ షార్క్స్ అని పేరు పెట్టారు. బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణుల సాయంతో చాలా దూరంలో ఉన్న టార్గెట్ పై నిప్పులు కురిపించే అవకాశం ఇప్పుడు పూర్తి స్థాయిలో భారత్ కి చేకూరిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. నేలమీద లేదా నీటిమీద ఉన్న టార్గెట్ ని సుఖోయ్ యుద్ధ విమానాల్లో అమర్చిన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు క్షణాల్లో భస్మీపటలం చేయగలుగుతాయి.

ఈ ఏడాది చివరికల్లా 18 సుఖోయ్ విమానాలను పూర్తిగా ఈ పనికోసం కేటాయించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి టైగర్ షార్క్స్ కి నాలుగు నుంచి ఆరు సుఖోయ్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఫ్యూయల్ నింపుకుంటే ఈ విమానాలు దాదాపుగా 1500 కిలోమీటర్ల పరిధిని అలవోకగా చుట్టి వచ్చే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయి. కావాలనుకుంటే గాల్లోనే వీటిలో మళ్లీ ఇంథనాన్ని నింపుకోగలిగే ఏర్పాటుకూడా ఉండడం విశేషం. ఫోర్త్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ సుఖోయ్ లను పూర్తి స్థాయిలో కలిగిన టైగర్ షార్క్స్ 12వ స్క్వాడ్రన్. మిరేజ్ 2000తో కలిపి బోర్డర్ లో అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న 36 రాఫెల్స్ వీటికి అనుసంధానంగా పనిచేస్తాయి.

త్రివిధ దళాల కోసం..

భారత ప్రభుత్వం రష్యా నుంచి రూ.1500 కోట్ల విలువైన సుఖోయ్ లను కొనుగోలు చేసేందుకు కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది. 260 నుంచి 272 సుఖోయ్ లు ఈ కాంట్రాక్ట్ వల్ల భారత్ కు అందుతాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ వ్యవహారాలను సమర్థంగా చూస్తోంది. ఈ ప్రాంతంలో గస్తీ తిరిగే 9 జెట్ విమానాలు వివిధ ప్రమాదాల్లో కూలిపోవడంవల్ల కొత్తగా భారీ ఎత్తున యుద్ధ విమానాలను గస్తీకోసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఇంజీన్ లో గ్లిచ్చెస్ రావడం, విడిభాగాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం అనే రెండు కారణాలు సుఖోయ్ లకు ఉన్న పరిమితులు. హెచ్ఎఎల్ ఇప్పుడీ పరిమితులను అధిగమించే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. 290 రేంజ్ ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్స్ ని భారత్ – రష్యా కలిసి తయారు చేశాయి. వీటి సామర్ధ్యం నిజంగా భారత్ రక్షణ వ్యవస్థ సత్తాని గణనీయంగా పెంచిందని చెప్పొచ్చు. భూమిమీదినుంచి, ఆకాశంనుంచి, నీటి మీదినుంచి వీటిని ప్రయోగించే అవకాశం పుష్కలంగా ఉన్నందువల్ల ఇవి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే ఆయుధాలుగా మారాయి మన అమ్ములపొదిలో. ఈ కారణంగానే రూ.30 వేల కోట్ల రూపాయల నిధులతో భారత త్రివిధ దళాలకు వీటిని పుష్కలంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

మొదటి పదకొండు సుఖోయ్ విమానాలను తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రక్షణకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. హల్వారా నుంచి పుణేవరకూ, జోథ్ పూర్ , సిర్సాలనుంచి బైరెల్లీ వరకూ, తేజ్ పూర్, చాబువా ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ విమానాలు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నాయి. ఇప్పుడు తంజావూర్ బేస్ లో మరికొన్ని విమానాలను ఏర్పాటు చేయడం ద్వారా మన రక్షణ వ్యవస్థను తిరుగులేని విధంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలత సాధించిందని చెప్పాలి. తమిళనాడులో ఉన్న ఐఎన్ఎస్ రాజధాని బేస్ నుంచి పనిచేస్తున్న పాసిడాన్ -81 లాంగ్ బేస్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తి స్థాయిలో తన సత్తాని, సామర్ధ్యాన్ని నిరూపించుకుంటోంది. దీనికి అమర్చిన సెన్సార్లు, ఆయుధాలు సబ్ మెరైన్లను గుర్తించి జలగర్భంలో కలిపేసే పూర్తి సామర్ధ్యాన్ని కలిగి ఉండడంవల్ల శత్రుదేశాల ఎత్తుల్ని చిత్తుచేయడానికి పూర్తగా అవకాశం కలుగుతోంది.

రాజపక్షే వల్ల భారత్ కు మేలు

ఇప్పుడు బ్రహ్మోస్ తో పరిపుష్టమైన సుఖోయ్ లు విస్తృత స్థాయిలో అందుబాటులోకి రావడంతో భూమ్మీద, ఆకాశంలో, నీటిమీద అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ మనకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందన్న విషయం శత్రుదేశాలకు తెలియడంవల్ల ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరాన్ని ఆ దేశాలు పూర్తిగా గుర్తించాయి. భారత్ శ్రీలంకల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ఫలితంగా ఆ దేశానికి రూ 500 కోట్ల సెక్యూరిటీ అసిస్టెన్స్ ను ఇచ్చేందుకు భారత్ నిర్ణయించింది. భారత రక్షణ సలహాదారు అజిత్ ధోవల్ శ్రీలంక అధ్యక్షుడు గోతేభ్య రాజపక్షేతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఇరు దేశాలూ ఇంటెలిజెన్స్ విషయంలో ఇతరత్రా రక్షణ ఏర్పాట్ల విషయంలో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత్ అందించే సాయంతో శ్రీలంక పూర్తి స్థాయిలో అత్యాధునికమైన రక్షణ పరికరాలను సమకూర్చుకుంటుంది. రాజపక్షే మళ్లీ అధికార బాధ్యతలను చేపట్టిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ తర్వాత భారత్ తరఫున శ్రీలంకకు వెళ్లి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధి అజిత్ ధోవల్. తమ దేశంపై చైనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో రాజపక్షే భారత్ కు సన్నిహితంగా ఉండడం వల్ల మేలు కలుగుతుందని భావిస్తున్నారు.

Next Story