హాలీవుడ్ దెబ్బతో బాలీవుడ్ హాహాకారాలు

By అంజి  Published on  30 Jan 2020 6:01 AM GMT
హాలీవుడ్ దెబ్బతో బాలీవుడ్ హాహాకారాలు

బాలీవుడ్ కి పెద్ద చిక్కే వచ్చిపడింది. హాలీవుడ్ నెమ్మది నెమ్మదిగా అరబ్బు వాడి గుడారంలో దూరిన ఒంటెలా నెమ్మదినెమ్మదిగా మార్కెట్ ను ఆక్రమించేస్తోంది. బాక్సాఫీసును కొల్లగొట్టేస్తోంది. గతేడాది బాలీవుడ్ థియేట్రికల్ కలెక్షన్లు అడుగంటిపోయాయి. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలకు కాసుల గలగల మోత మోగించేసింది. గతేడాది మొత్తంలో ముగ్గురు ఖాన్ లు - ఆమిర్, సల్మాన్, షారుఖ్‌లకు -ఒక్క హిట్టు కూడా లేదు. మరో వైపు అవెంజర్స్ వంటి హాలీవుడ్ సినిమాలు ఖజానాలు కొల్లగొట్టేశాయి.

ఇదేదో ఒక్క 2019 కి మాత్రమే పరిమితమైన కథ కాదు. గత అయిదారేళ్లుగా ఇదే వరస. మన బాక్సాఫీస్ ను హాలీవుడ్ వాడు బద్దలుగొట్టేస్తున్నాడు. మన మార్కెట్ మనకి కాకుండా పోతోంది. బుక్ మై షో, ఓర్మాక్స్ మీడియా, ఈ వై, బీ అండ్ కే రీసెర్చి వంటి సంస్థల టికెట్ల అమ్మకాలను చూస్తే , హిందీ సినిమాల బాక్సాఫీస్ మార్కెట్ షేర్ 2015 లో 60-65 శాతం వరకూ ఉండగా, 2019 లో అది 45 శాతానికి పడిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ సినిమాల వసూళ్ల షేర్ 2015 లో కేవలం 8.4 శాతం ఉండగా, 2019 లో 20.8 శాతానికి పెరిగింది. హాలీవుడ్ కి గత రెండేళ్లు భలే బాగా గడిచాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలు రికార్డులన్నిటినీ బద్దలు గొట్టేశాయి.

2015 లో హాలీవుడ్ చిత్రాలు రూ. 661 కోట్లు వసూలు చేయగా, 2016 లో అది రూ. 795 కోట్లకు పెరిగింది. ఆ తరువాతి సంవత్సరం రూ. 8౦1 కోట్లు సంపాదించింది. 2018 లో వసూళ్లు రూ. 921 కోట్లకు పెరిగాయి. గతేడాది రూ. 1280 కోట్ల మేరకు వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పుడు 2020లోనూ పలు బ్లాక్ బస్టర్లు విడుదల కాబోతున్నాయి. అందులో నో టైమ్ టు డై, బ్లాక్ విడో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 , వండర్ వుమన్ లు ఉన్నాయి.

Next Story
Share it