లెక్కలు సరిచేయాల్సింది తాప్సీ, ఆలియాలే..!

By సుభాష్  Published on  17 Feb 2020 2:39 PM GMT
లెక్కలు సరిచేయాల్సింది తాప్సీ, ఆలియాలే..!

బాలీవుడ్ లో లేడీ ఓరియంట్ సబ్జెక్టులను బాగానే ఆదరిస్తారు. గతంలో దీపికా పదుకోన్, కంగనా రనౌత్ లు నటించిన సినిమాలు వంద కోట్ల మార్కును ఈజీగా దాటిపోయాయి. కానీ ఈ మధ్య ఆ పరిస్థితి కనిపించడం లేదు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకోన్ చాలా గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం 'చపాక్' సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీపికా ఢిల్లీ లోని జె.ఎన్.యు. కు వెళ్లడంతో ఆమె సినిమాకు కావాలనే తక్కువ రేటింగ్స్ ఇచ్చారు కూడానూ.. అది సినిమా కలెక్షన్లపై భారీగానే ప్రభావం చూపించింది. ఇప్పటికే నటన పరంగా నేషనల్ అవార్డులు గెలుచుకున్న కంగనా రనౌత్ నటించిన 'పంగా' సినిమాను కనీసం ప్రేక్షకులు పట్టించుకోలేదు. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన పంగా సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏవీ లేవంటూ రివ్యూ రైటర్లు పెదవి విరిచారు. ఇక బాలీవుడ్ లో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ముఖ్యంగా తాప్సీ, ఆలియా భట్ లు నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాయి..!

బాలీవుడ్ లో ఓ వైపు యంగ్ హీరోల సరసన నటిస్తూ మరోవైపు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం 'థప్పడ్'.. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. పింక్, బద్లా సినిమాల ద్వారా సక్సెస్ ను అందుకున్న తాప్సీ 'థప్పడ్' సినిమాతో మరో హిట్ అందుకుంటే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు బాలీవుడ్ లో ఇంకా కాలం ఉన్నట్లేనని అర్థం చేసుకోవచ్చు. థప్పడ్ సినిమా 'జెండర్' కు సంబంధించింది కాదని అంటున్నాడు డైరెక్టర్ అనుభవ్ సిన్హా. ముఖ్య పాత్రను పోషించింది ఆడా-మగ అని కాకుండా.. సినిమా థీమ్ ఎలాంటిది.. క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని చూడాలని.. అలాంటప్పుడే సినిమా వర్కౌట్ అవుతుందని చెబుతున్నాడు. సినిమాలన్నవి బాగున్నాయా-బాగలేవా అన్నది ప్రేక్షకులు పట్టించుకుంటారని.. పెద్ద హీరోనా-హీరోయినా అన్న విషయం అసలు పట్టించుకోరని చెప్పుకొచ్చాడు. మేఘనా గుల్జార్, అశ్విని అయ్యర్ తివారీ లాంటి వారు గొప్ప దర్సకులేనని.. దీపిక, కంగనా పెద్ద స్టార్స్ అని.. కానీ వీరి సినిమాలు ఈ మధ్య ఎందుకు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయో వివరించలేకపోతున్నానని అన్నాడు.

ట్రేడ్ విశ్లేషకులు మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద స్టార్స్ సపోర్టు ఖచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. పెద్ద హీరోలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మద్దతుగా నిలిస్తే సినిమా ఎక్కువ మందికి చేరుతుందని అంటున్నారు.

థప్పడ్ సినిమా తర్వాత బాలీవుడ్ లో రాబోతున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆలియా భట్ నటిస్తున్న 'గంగూబాయ్ కథియావాడీ'..! ఈ సినిమాలో లేడీ గ్యాంగ్స్టర్ పాత్రలో ఆలియా భట్ నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అజయ్ దేవగన్ ను అడిగినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ లాంటి స్టార్ ఉంటే ప్రేక్షకులు సినిమా హాల్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికే హైవే, రాజి లాంటి సినిమాల ద్వారా స్టార్ గా ఎదిగిన ఆలియా భట్.. గంగూబాయ్ కథియావాడీ పాత్రలో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

Next Story
Share it