బోడో సమస్యకు పరిష్కారం కనుగొన్న వాళ్లిద్దరూ యువకులే

By అంజి
Published on : 30 Jan 2020 3:46 PM IST

బోడో సమస్యకు పరిష్కారం కనుగొన్న వాళ్లిద్దరూ యువకులే

ముఖ్యాంశాలు

  • వారిలో ఒకరు రాజవంశపు వారసుడు పృధ్వీరాజ్ నారాయణ్
  • రెండోవ్యక్తి మద్రాస్ ఐఐటీ గ్రాడ్యుయేట్ తులుంగ బాసుమతారి
  • ఇద్దరూ యువరక్తం ఉరకలు వేసే ఉన్నతమైన వ్యక్తులే
  • ప్రజల సంక్షేమంకోసం ఆలోచించే లక్షణం యువరాజుది
  • మాతృభూమి సమస్యలు తీర్చాలన్న తపన తులుంగది
  • బోలెడన్ని ఎమ్.ఎన్.సి పోస్టింగుల్ని వద్దనుకున్న తులుంగ
  • మాతృభూమికి సేవచేయాలన్న పట్టుదలతో ముందడుగు
  • వైవిధ్యాన్ని చాటుకున్న ఇద్దరు నవతరం యువకులు

గౌహతి: ఇరవైల్లో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు బోడో సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. వారిలో ఒకరు గడచిన కాలపు రాచరికపు పారంపర్యాన్ని గుర్తుచేసే వారసుడుకాగా మరొకరు ఐఐటి మెడ్రాస్ గ్యాడ్యుయేట్. తమ మాతృభూమిలో తుపాకుల చప్పుళ్లు ఇకపై వినిపించకూడదన్న దృఢ సంకల్పంతో వీళ్లిద్దరూ శాంతి చర్చలకు నడుంబింగించారు.

కేంద్ర హోంశాఖ అనుమతితో మియాన్మార్ కి వెళ్లి అక్కడున్న ఎన్.డి.ఎఫ్.బి విప్లవకారుల్ని మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రెండు వారాల్లోనే ఇరు పక్షాల మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ప్రయత్నంలో ఏమాత్రం ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సరే వీళ్లద్దరి ప్రాణాలూ గాల్లో కలిసిపోయేవి. అసలు అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లు వీళ్లిద్దర్నీ పట్టుకుని కాల్చిపారేసినా అడిగే దిక్కే లేదు.

అయినా ఈ ఇద్దరు యువకులు అత్యంత ధైర్య సాహసాలను, సమయస్ఫూర్తిని, ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శించి మాతృభూమికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. యువరాజు రాజ్ కుమార్ పృధ్వీ రాజ్ నారాయణ్ దేవ్ మెక్, బోడో రాజు చిక్రా మెక్ కి 19వ తరం వారసుడు. ఈమధ్యే ఇరవై రెండేళ్ల వయసు పూర్తయ్యింది తనకి.

తులుంగ బాసుమతారి ఐఐటీ గ్రాడ్యుయేట్. నూనూగు మీసాల కుర్రాడు. ఐఐటీ మద్రాస్ లో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. 2018నుంచి వెల్లువెత్తిన మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగ అవకాశాలను కాదనుకుని తన మాతృభూమి గుండె చప్పుడు వినే ప్రయత్నం చేశాడు. తన మాతృభూమి పడుతున్న వేదనను తీర్చే ప్రయత్నం చేశాడు.

వీళ్లద్దరూ కలిసి కేంద్ర హోం శాఖనుంచి అనుమతి తీసుకున్నారు. వెంటనే ఢిల్లీనుంచి బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ్నుంచి మ్యాండలేకి అక్కడ్నుంచి డిసెంబర్ 9న నేరుగా మియాన్మార్ కి వెళ్లారు. మాండలే నుంచి ఆ కారును అద్దెకు తీసుకుని మూడు గంటలపాటు ప్రయాణం చేసి మియాన్మార్ కి వెళ్లారు.

అక్కడున్న ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) నేతలతో మాట్లాడి వాళ్లను జనజీవన స్రవంతిలో కలవడానికి ఒప్పించి డిసెంబర్ 10న తిరిగి ఇండియాలో అడుగు పెట్టారు. ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) నేతలు ఇచ్చిన డ్రాఫ్ట్ మెమొరాండమ్ ఆఫ్ సెటిల్ మెంట్ ని తీసుకొచ్చి కేంద్ర హోం శాఖకు అప్పగించారు. దానిపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇదేం ఆషామాషీ విజయం కాదు. శతాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన సాహసం.

బోడో రెబెల్స్‌ కూడా..

ఒప్పంద పత్రంలో రాసి ఉన్న విషయాలకు సంబంధించి దాదాపుగా అసోం ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రధానమైన సమస్యలన్నింటినీ బోడో రెబెల్స్ కి సంబంధించిన సమస్యల్నీ 80 శాతానికిపైగా ప్రస్తావించామనీ, బోడో రెబెల్స్ కూడా వాటిపై సంతృప్తిని వ్యక్తం చేశారనీ ఇద్దరు నవతరం వీరులు చెబుతున్నారు.

యువరాజుకైతే ప్రజలకు ఏదైనా చేయాలన్న కాంక్ష తన రక్తంలోనే జీన్స్ లోనే ఉంది. యువ గ్రాడ్యుయేట్ కేమో తన మాతృభూమి ఎదుర్కుంటున్న సమస్యలను పూర్తిగా తొలగించాలన్న ఆరాటం ఉంది. ఈ రెండు యువకెరటాల సారధ్యంలో శాంతి అనే కల సాకారమయ్యింది.

Next Story