దేశభక్తి గురించి మాట్లాడే ఓ భారతీయుడా నీకు 'రవీందర్ కౌశిక్' గురించి తెలుసా..!
By అంజి Published on 16 Feb 2020 1:24 PM GMT
మనమంతా ఏ జెండా పండుగకో.. లేదా బోర్డర్‌లో సైనికులు చనిపోయినప్పుడో.. అభినందన్ వర్థమాన్ లాంటి ఎవరో ఒక రియల్ హీరో కనపడ్డప్పుడు, మనకు రోమాలు నిక్కబొడిచినప్పుడు మాత్రమే దేశభక్తి అనే టాగ్‌ను తగిలించుకుంటాం. కానీ నరనరాన దేశభక్తిని నింపుకుని.. తుది గడియ వరకూ దేశం కోసమే శ్వాస తీసుకున్న వీర భారతీయుని గురించి మీకు తెలుసా? తెలీదా ? ఇప్పుడు తెలుసుకోండి.
ఈ ఫోటోలో ఉన్నది సాధారణ వ్యక్తి అనుకుంటున్నారా? కాదు. కానే కాదు. ఇతని పేరు రవీందర్ కౌశిక్. ఒక్కప్పటి భారతీయ రహస్య గూఢచారి. మన దేశం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి, ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడు. ప్రతి ఒక్క భారతీయుడూ.. ఇతని ధైర్యం, సాహసం, త్యాగం గురించి ఖచ్చితంగా తెలుసుకొవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
రవీందర్ 1952 ఏప్రిల్ 11 న కర్నాల్, హర్యానాలో జన్మించారు. చిన్నతనంలో అతనికి నాటకాలలో ప్రవేశం ఉండేది. ఆయన తన 23వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAWలో చేరారు. ఆ రోజులలో పాకిస్తాన్‌కు "అండర్ కవర్"గా వెళ్లాలంటే ఎవరూ ముందుకు వచ్చే వారు కారు. అటువంటి సమయంలో నేను వెళ్ళతాను అని రవీందర్ కౌశిక్ ముందుకు వచ్చాడు.
పాకిస్తాన్‌కు వెళ్ళడం కోసం రవీందర్ ఉర్దూ నేర్చుకున్నాడు. మతం మార్చుకుని పాకిస్తానీల మతవిద్యను కూడా నేర్చుకున్నాడు. 1975 లో అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌కు ఏమాత్రం అనుమానం రాకుండా కరాచి యూనివర్శిటీలో ఎల్ఎల్‌బీ పూర్తిచేసి.. అనంతరం పాక్ ఆర్మీలో చేరాడు. ఈ క్రమంలోనే ఇస్లాం మతం తీసుకున్నాడు. అక్కడే అమానత్‌ను వివాహమాడాడు.
ఇక.. 1979వ సంవత్సరం నుండి 1983వ సంవత్సరం వరకు రవీందర్.. పాక్ సంబంధించి అత్యంత విలువైన సమాచారాన్ని RAW మరియు భారతీయ సైనిక దళాలకు పంపించేవాడు. పాక్.. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలనుకున్న ప్రతిసారి ముందగానే సమాచారాన్ని ఇచ్చి ఆ ఆపద నుండి కాపాడేవాడు. కాని, దురదృష్టవశాత్తూ.. మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు.
పాక్ అప్పటి నుండి రవీందర్ కౌశిక్‌ను 16 సంవత్సరాల పాటు భారతదేశ రహస్యాలు చెప్పాలంటూ తీవ్రంగా హింసించింది. ఆయన మలవిసర్జనాన్ని ఆయన చేతే బలవంతంగా తినిపించే వారట. అయినా గొప్ప దేశభక్తుడైన రవీందర్.. తనను ఎంత హింసించినా ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదు.
ప్రభుత్వం తనను ఎప్పటికైనా కాపాడుతుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూపాడు. కానీ చివరికి క్షయ వ్యాధి సోకి 1999వ సంవత్సరం జూలై 26న రవీందర్ మరణించారు. రవీందర్ మరణానంతరం అతనిని జైలు వెనుక భాగంలోనే ఖననం చేసారు. అతని ధైర్యానికి మెచ్చి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అతనికి 'బ్లాక్ టైగర్' అని బిరుదునిచ్చింది.