పట్నా:బిహార్ పంచాయితీకి తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ గొడవకు పుల్‌స్టాప్ పడింది. బిహార్‌లో బీజేపీ-జేడీయూ కూట‌మికి సీఎం నితీష్ కుమారే నాయకుడని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నితీష్ సారధ్యంలోనే పోరాడతామని స్పష్టం చేశారు. 2020లోనూ నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెప్పారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీ-జేడీయూ బంధం విడ‌దీయ‌రానిద‌న్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ, జేడీయూలు సమష్టిగా పని చేస్తున్నాయన్నారు.

సీఎం కుర్చీ కోసం కొట్లాట..!

బిహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమికి నాయకుడెవరనే అంశంపై ఇటీవల రగడ చెలరేగింది. సీఎం పీఠాన్ని మరొకరికి అప్పగించాలని కమలదళం నుంచి డిమాం డ్లు వచ్చాయి. ఇన్నేళ్లుగా తాము మద్దతివ్వడం వల్లే సీఎం కుర్చీలో నితీష్ కుమార్ కూర్చోగలిగారని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ తాము చేసిన మేలుకు ప్రతిఫలంగా వచ్చే ఎన్నికల తర్వాత సీఎం పీఠాన్ని తమకు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాఖ్యలు బిహార్‌లో కలకలం రేపాయి. బీజేపీ డిమాండ్‌ను జేడీయూ నేతలు తోసిపుచ్చారు. రాష్ట్రంలో నితీష్ కుమార్ కంటే మెరుగైన నాయకుడు మరొకరు లేరని ఎదురుదాడి చేశారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానగా మారి రెం డు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరిగింది. దాంతో అటు కూటమి పరువు, ఇటు ప్రభుత్వ ప్రతిష్ట బజారున పడే పరిస్థితి ఏర్పడింది. దాంతో బీజే పీ నాయకత్వం రంగంలోకి దిగింది. పరిస్థితి మరింత విషమించకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమిత్ షా క్లారిటీతో బీజేపీ నాయకుల నోళ్లకు తాళాలు పడ్డాయి. జేడీయూ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగినట్లే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.