ఎన్నో చర్చోపచర్చలు, మరెన్నో ఆలోచనలు, సంప్రదింపుల నడుమ ఎట్టకేలకు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ నాయకత్వంలో జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో ఆదివారం హ‌ర్యానాలో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం రాకపోవడంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. పది స్థానాలతో అనూహ్యా విజయాన్ని అందుకున్న జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా వైపుకు తిరిగాయి. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి.

కాంగ్రెస్ ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. అయితే కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లతో వారిద్దరూ కలిసినా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఐదు సీట్లు కావాల్సి ఉంది. స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన సభ్యులు దాదాపు 18 మంది ఉన్నారు. ఆ 18 మందిలో ఐదుగురిని తమ వైపుకు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ నాయకత్వంలోనే ప్రభుత్వం కొలువుదీరి ఉండేది. కానీ కింగ్ మేకర్ గా మారిన దుష్యంత్ మాత్రం బీజేపీకే తన మద్దతు అని ప్రకటించేశారు. దీంతో హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది.

ప్రభుత్వ ఏర్పాటులో కేంద్ర బీజేపీ అధిష్టానం మంత్రాంగం బాగా పని చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమిత్ షా సూచనల మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యూహ రచన చేశారని సమాచారం. ఆ తర్వాతే దుష్యంత్ బీజేపీకి తన మద్దతు అని ప్రకటించారని హర్యానా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కమలం సర్కార్ కోలువుదీరడంలో కీలక పాత్ర పోషిస్తున్న జేజేపీకి ఎలాంటి పదవులు దక్కపోతున్నాయి అనేది ఆసక్తికర అంశం. విశ్వాసనీయ సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జేజేపీ సభ్యులకు కేబినెట్ లో రెండు నుంచి మూడు బెర్త్త్ లు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే.. ఉప ముఖ్యమంత్రి పదవి తనకి కాకుండా తన తల్లి నైనా చౌతాలాకు ఇవ్వాలని ప్రతిపాదన దుష్యంత్ చౌతాలా తెచ్చారని చర్చ కూడా సాగింది. తల్లి కంటే కుమారుడు దుష్యంత్ చౌతాలా ఉంటేనే బాగుంటుందని జేజేపీ సభ్యులు వారిస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి జేజేపీ సహకారంతో హర్యానా రాష్ట్ర సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకుండానే బీజేపీ లాంటి కొమ్ములు తిరిగిన పార్టీని తన దగ్గరకు తెచ్చుకోగలిగిన దుష్యంత్ చౌతాలాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.