ఒసామా కంటే సులే ఇమానీని చంపడమే అగ్రరాజ్యానికి కష్టమైందా?

By రాణి  Published on  4 Jan 2020 8:00 AM GMT
ఒసామా కంటే సులే ఇమానీని చంపడమే అగ్రరాజ్యానికి కష్టమైందా?

ముఖ్యాంశాలు

  • ఒసామా బిన్ లాడెన్ అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాది
  • బాగ్దాదీకి అంతర్జాతీయ స్థాయిలో అదే గుర్తింపు
  • సులే ఇమానీ ఇరాన్ కుర్దిష్ దళాల ప్రధాన కమాండర్
  • అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒసామా, బాగ్దాదీ
  • డ్రోన్ మిస్సైల్ దాడిలో ఖాసిం సులే ఇమానీ దుర్మరణం

ఇరాన్ కుర్దిష్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులే ఇమానీని మట్టుపెట్టేందుకు అమెరికా తన సర్వశక్తుల్నీ ఒడ్డింది. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యాలో అన్ని విధాలుగానూ ప్రయత్నాలు చేసి చివరికి సులే ఇమానీ ప్రాణాలు తీసేవరకూ అగ్రరాజ్యానికి నిద్రపట్టలేదు. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా ఈ టాస్క్ ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టే లెక్క.

ఒసామా బిన్ లాడెన్ ను 2011 , మే2న మట్టుబెట్టగా..అబు అల్ బఖర్ బాగ్దాదీని 2019, అక్టోబర్ 26న చంపింది అమెరికా. ఒసామా బిన్ లాడెన్ ని, అబు అల్ బఖర్ బాగ్దాదీని మట్టుపెట్టినదానికంటే సులే ఇమానీ ప్రాణాలను హరించడమే అమెరికాకు అత్యంత కీలకమైన ఆపరేషన్ గా తోచింది. దీనికి కారణం. ముందువాళ్లిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులుగా ముద్రపడ్డవాళ్లు. అల్ ఖైదాకు చెందినవాళ్లు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా కేవలం వాళ్లు అనుకున్నదాన్ని సాధించేందుకు వ్యవస్థలనే శాశించినవాళ్లు.

ఉగ్రవాదులను వెతికి పట్టుకుని మట్టుపెట్టడం నిజానికి చాలా కష్టమైన పని. కానీ అమెరికా ఆ పనిలో విజయం సాధించగలిగింది. దానికి అన్ని వైపులనుంచీ పెద్ద ఎత్తున అన్ని విధాలుగానూ మద్దతుకూడా లభించింది. ఓసామా తనకు తానే ఉగ్రవాదినని చెప్పుకున్నాడు. తన దేశంకూడా తనని ఉగ్రవాదిగానే గుర్తించింది. బాగ్దాదీపై అమెరికా ఉగ్రవాది అనే ముద్రవేసి, వలేసి పట్టుకుని మరీ ప్రాణాలు తీసింది.

సులే ఇమానీ విషయంలో అలాకాదు. ఇరాన్ కుర్దిష్ దళాలకు సులే ఇమానీ కమాండర్. పూర్తి స్థాయిలో యుద్ధానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి, ఒసామాలా, బాగ్దాదీలా ఎక్కడో దాక్కుని కంటపడకుండా తిరిగేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. సులే ఇమానీ బాహాటంగానే తిరిగాడు. తన దేశానికి తాను చేయాల్సిన సేవ చేసుకుంటూ పోయాడు. ఎక్కడా తొణుకులేదు బెణుకు లేదు.

అమెరికా సులే ఇమానీని మట్టుపెట్టడంతో ఇరాన్ తో రాజుకున్న నిప్పు మరింతగా రాజుకుంది. అగ్గిలో ఆజ్యం పోసినట్టయ్యింది. తమ మిలటరీ కమాండర్ ని చంపినందుకు ప్రతిగా ఏ నిముషానైనా సరే ఇరాన్ పెద్దఎత్తున తిరిగి సమాధానం చెప్పే అవకాశమూ లేకపోలేదు. అయితే ఆ ఉపద్రవం ఏ రూపంలో, ఎటువైపునుంచి ముంచుకొస్తుందో మాత్రం ఊహించడం కష్టమే. ఈ చర్యతో టెహ్రాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి సంబంధించి జరగాల్సిన చర్చలకు అసలు ఆస్కారం లేకుండా పోయిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంటున్నారు.

Next Story