మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా.. అయితే ఆ 35 లక్షలు మీవే..!
By న్యూస్‌మీటర్ తెలుగు
సరిగ్గా 2 సంవత్సరాల రెండు నెలల క్రితం.. 2016 నవంబర్ 8వ తేది రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన షాక్ గుర్తుంది కదా..! ఈ రోజు అర్థరాత్రి నుండి రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి కరెన్సీ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైసల కోసం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో తెలియంది కాదు.
అయితే.. జనాల ఇబ్బందులను పేటీఎం తో పాటు మరికొన్ని డిజిటల్ పేమెంట్ యాప్‌లు అవకాశంగా అందిపుచ్చుకున్నాయి. ప్రభుత్వం కూడా భీమ్ యాప్‌ను తెచ్చింది. ఫలితంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్‌లలోనే జరుగుతున్నాయి.
కాగా, దేశంలో స్మార్ట్ ఫోన్‌ల వాడేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్‌లు వాడుతున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా వేసింది. దీంతో ఫీచర్ ఫోన్‌లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆదేశించింది.
దీంతో.. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో, ఎన్‌పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టేందుకు రంగంలోకి దిగాయి. ఫీచర్ ఫోన్లలో యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్లు (రూ.35.85 లక్షలు) బహుమతిగా ప్రకటించాయి. ద్వితీయ బహుమతి రూ.21.5 లక్షలు(30 వేల డాలర్లు), తృతీయ బహుమతి రూ.14.34 లక్షలు(20 వేల డాలర్లు) నిర్ణయించింది. ఈ పోటీ జనవరి 12న ముగియనుండగా.. విజేతలను మార్చి 14న ప్రకటిస్తారు.