వలస కార్మికులకు 17లక్షల కండోమ్‌లు పంచాం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 9:50 AM GMT
వలస కార్మికులకు 17లక్షల కండోమ్‌లు పంచాం

బీహార్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు లాక్‌డౌన్‌తో తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచింది. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లే వలస కార్మికులకు ప్రభుత్వం తరుపున 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చి స్వీయ నిర్బంధంలో ఉన్న లక్షలాది మంది నిరక్షరాస్యుల్లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇటువంటి వినూత్న పద్దతిని ఫాలో అవుతున్నట్లు చెప్పారు.

'కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారంతోపాటు గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లతో ఉన్న కిట్‌లను వ‌ల‌స కార్మికుల‌కు పంపిణీ చేశామని, 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేసిన వలస కార్మికులకు సర్కార్ వాటిని బహుమానంగా ఇచ్చింది' అని సుశీల్ మోదీ పేర్కొన్నారు.

ఇక ఏప్రిల్ నెల‌లో 2.14 లక్షల కండోమ్‌లను పంపిణీ చేయగా, మే నెల‌లో 15.39 లక్షల కండోమ్‌లను పంపిణీ చేశామని, మొత్తంగా 17.53 లక్షల కండోమ్‌లను వలస కార్మికులకు పంపిణీ చేశామని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్నవారెవరు అయినా సరే అక్కడకు వెళ్లవచ్చునని సూచించారు.

Next Story