బిగ్‌బాస్-4కు నాగార్జున దూరం కానున్నాడా..?
By సుభాష్ Published on 6 Oct 2020 2:04 PM ISTతెలుగులో స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ -4కు హోస్టుగా నాగార్జున చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ షోలో పెద్దగా తెలిసిన సెలబ్రెటీలు లేకపోయినా.. తన టైమింగ్, పంచ్‌లతో షోను అదరగొడుతున్నారు. ప్రారంభంలో ఈ షోకు రేటింగ్ పెద్దగా లేకపోయినా.. మెల్లమెల్లగా రేటింగ్ పెంచేలా కృషి చేశారు నాగార్జున. ఇక ఈ సీజన్ నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్నాళ్ల పాటు నాగార్జున బిగ్‌బాస్ షోకు దూరంగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం వైల్డ్ డాగ్ మూవీ అని తెలుస్తోంది.
కింగ్ నాగార్జున.. సోలోమన్ డైరెక్షన్‌లో వస్తున్న వైల్డ్ డాగ్ అనే ఓ యాక్షన్ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో కీలకమైన షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం. కనీసం 20 రోజుల పాటు అక్కడే షూటింగ్ కొనసాగనుందట. ఇదే కనుక నిజమైతే ఈ 20 రోజులూ బిగ్‌బాస్‌కు నాగార్జున హాజరు కాబోరని తెలుస్తోంది. శని, ఆదివారాల్లో నాగ్ తెరపై కనిపిస్తాడు. అంటే దాదాపు ఆరు ఎపిసోడ్‌లలో నాగార్జున కనిపించడు. ఆయా ఎపిసోడ్‌లను ఎవరితో భర్తీ చేయాలి అనే విషయాన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సీజన్‌లో లాగే రమ్యకృష్ణతోనైనా, లేదా ఇంకెవరితోనైనా షోను రన్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలే ఈ సీజన్‌పై జనాలకు పెద్దగా ఆసక్తి లేదు. అందులోనూ ఈ హౌస్‌లో తెలిసిన కంటెస్టెంట్లు పెద్దగా లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో నాగ్ వెళ్లిపోతే రేటింగ్ మరింత పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే షో రేటింగ్ పెంచే హోస్టు ఎవరిని తీసుకురావాలన్న ఆలోచనలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.