మంత్రి హ‌రీశ్‌రావుకు బిగ్ కౌంట‌ర్‌..!

By రాణి  Published on  30 Dec 2019 8:42 AM GMT
మంత్రి హ‌రీశ్‌రావుకు బిగ్ కౌంట‌ర్‌..!

హైద‌రాబాద్ అన్న‌ది వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి అభివృద్ధి చెందుతూ వ‌స్తున్న మ‌హాన‌గ‌రం. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అయితే, ఆధునిక హైద‌రాబాద్ నిర్మాణంలో సీమాంధ్ర ప్ర‌జ‌ల కృషి కూడా ఉంది. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ, తెలంగాణ ఉద్య‌మం కార‌ణంగా రాష్ట్రం రెండుగా విడిపోవ‌డంతో హైద‌రాబాద్‌ తెలంగాణ‌కు ప‌రిమిత‌మైపోయింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిగిలిపోయింది. ఐదేళ్ల‌లో ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్మిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పినా ఆ ప‌నిచేయ‌లేక‌పోయారు. అమ‌రావ‌తి నిర్మాణం దాదాపు సాధ్యం కాదు అన్న‌ది కూడా తేలిపోయింది. ల‌క్ష‌ల కోట్లు తీసుకెళ్లి అమ‌రావ‌తిలో పోస్తే త‌ప్పించి అక్క‌డ ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నేప‌థ్యంలో అమ‌రావ‌తి నిర్మాణం ఇక సాధ్యం కాక‌పోవ‌చ్చు.

విశాఖ‌ప‌ట్నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉన్న‌ప్ప‌టికీ కూడా ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు నాయుడు పెద్ద‌గా ఆ న‌గ‌రాన్ని అభివృద్ధి చేయాల‌న్న దిశ‌గా ప్ర‌య‌త్నాలైతే చేయ‌లేదు. కానీ, ల‌క్ష‌ల కోట్లు తెచ్చి అమ‌రావ‌తిని నిర్మించ‌డం కంటే ఇప్ప‌టికే ఉన్న విశాఖ‌ను మ‌రింత అభివృద్ధి చేసి మ‌హాన‌గ‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒక వ‌జ్రంలా త‌యారు చేయాలి ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ ఆలోచ‌న‌. ఈ ఆలోచ‌న నేప‌థ్యంలోనే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేయాల‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. ఇలా రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌పైన ప్ర‌స్తుత‌మైతే కాస్త గంద‌ర‌గోళ ప‌రిస్థితి న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో స్పందించిన తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితుల‌ను కాస్త హేళ‌న చేసేలా ఒక కార్య‌క్ర‌మంలో న‌వ్వ‌డం మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏ కష్టాలు లేని నగరం హైదరాబాద్ ఒక్కటే..

హైద‌రాబాద్ ఘ‌న కీర్తిని హ‌రీశ్‌రావు ఉటంకిస్తూనే దేశంలోని మిగిలిన న‌గ‌రాల‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ‌. బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఎక్కువ‌. ముంబైకు మూడు వైపులా స‌ముద్రం ఉంది. అలాగే చెన్నైలో నీటి క‌ష్టాలు ఉన్నాయి. ఏ క‌ష్టాలు లేని.. ఎలాంటి ఇబ్బందులు లేని ఒక న‌గ‌రం హైద‌రాబాద్ మాత్ర‌మేన‌ని హ‌రీశ్‌రావు అన్నారు. తెలంగాణ మంత్రిగా ఉన్న హ‌రీశ్‌రావు త‌న రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ను పొగుడుకునే కార్య‌క్ర‌మం అంత వ‌ర‌కు ప‌రిమిత‌మై ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. అదే స‌మయంలో ఇటీవ‌ల ఏపీలో చోటుచేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు కూడా హైద‌రాబాద్‌కు లాభిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు లాభిస్తున్నాయి అంటూ హ‌రీశ్‌రావు త‌న ప్రసంగంలో న‌వ్వుతూ చెప్పారు. హ‌రీశ్‌రావు అలా న‌వ్వ‌డ‌మే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే, హ‌రీశ్‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌కు, ఆంద్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కౌంట‌ర్ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో హ‌రీశ్‌రావు అభిప్రాయం పొర‌పాటు అని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఏపీ అనిశ్చితి హైద‌రాబాద్‌కు తాత్కాలికంగా మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీర్ఘ‌కాలికంలో కానే కాద‌ని ఐవైఆర్ కృష్ణారావు స్ప‌ష్టంగా చెప్పారు. విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధానిగా కుదుట‌ప‌డితే హైద‌రాబాద్ బెంగళూరుల‌ను త‌ల‌ద‌న్నే స్థాయిలో విశాఖ‌ప‌ట్నం అభివృద్ధి చెంది తీరుతుంద‌ని ఐవైఆర్ కృష్ణారావు ధీమా వ్య‌క్తం చేశారు. విశాఖ‌ప‌ట్నం అన్న‌ది మ‌రో ముంబై న‌గ‌రంగా మార‌బోతుంద‌ని కూడా ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. క‌నుక ఏపీలో అనిశ్చితి కార‌ణంగా హైద‌రాబాద్‌కు శాశ్వ‌తంగా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని హ‌రీశ్‌రావు అనుకోవ‌డం పొర‌పాటు అని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీలో అనిశ్చితి మ‌రెంతో కాలం కొన‌సాగే ప‌రిస్థితులు లేవ‌ని, విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధానిని ఏర్పాటు చేయ‌డం ద్వారా అనిశ్చితికి తెర‌దింపేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తుంది అని కూడా ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.

ఏదేమైనా.. సున్నా నుంచి మొద‌లెట్టి ల‌క్ష‌ల‌కోట్లు ఖ‌ర్చుపెట్టి అమ‌రావ‌తిని నిర్మించుకునే క్ర‌మంలో ఏపీకి ఇబ్బందులు ఉంటాయే కానీ.. ఇప్ప‌టికే అన్ని హంగులు ఉన్న విశాఖ‌ప‌ట్నంపైన ప్ర‌భుత్వం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుని అక్క‌డ ఫోక‌స్‌పెట్టి పెట్టుబ‌డుల‌ను విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌య‌త్నిస్తే మాత్రం విశాఖ‌ప‌ట్నం అన్న‌ది ఏపీకి ఒక పెద్ద‌న్న‌లాగా నిల‌బ‌డుతుంది. ఏపీ తిరిగి త‌లెత్తుకు నిల‌బ‌డే స్థాయికి ఏపీని విశాఖ‌ప‌ట్నం తీసుకెళుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు.

Next Story