బాలు కోసం ప్రార్థనలు చేద్దాం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  20 Aug 2020 1:20 PM GMT
బాలు కోసం ప్రార్థనలు చేద్దాం..!

  • సినీ ప్రముఖుల పిలుపు
  • కన్నీరు మున్నీరయిన భారతీరాజ
  • బాలు కోసం వీడియో విడుదల చేసిన మెగాస్టార్‌ చిరంజీవి

పాటల దేవుడు.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజులుగా చెన్నై ఆస్పత్రిలో కరోనాతో భీకరంగా పోరాడుతున్నారు. తన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు హెల్త్‌ బులిటెన్‌లు విడుదల చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలు త్వరగా కోలుకుని రావాలని.. తన గాంధర్వ స్వరంతో మళ్ళీ అందరినీ సమ్మోహనం చేయాలని ముక్కోటి దేవతలకు మొక్కుతున్నారు. బాలు పేరిట జపతపాలు, యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారు.

బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ ఏరోజుకారోజు తండ్రి ఆరోగ్య సమచార వీడియో ఫేస్‌బుక్‌లో పెడుతున్నప్పటికీ అభిమానుల ఆందోళన ఏమాత్రం తగ్గట్లేదు. చెన్నై సినీ ప్రముఖులు రజనీకాంత్, కమల్‌హాసన్, భారతీరాజా, ఇళయరాజతా తదితరులు బాలు స్వస్థత కోసం అభిమానులు గురువారం వారి వారి ఇళ్ళల్లో దేశవ్యాప్తంగా సామూహిక ప్రార్థనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రార్థన సమయంలో బాలు పాట కూడా పెట్టాలని సూచించారు.

బాలు కోవిడ్‌ లక్షణాలుండటంతో ఈనెల 5 నుంచి చెన్నై లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పోరాడుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబరెన్స్‌ (ఎక్మా) సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఏడుపదుల పైచిలుకు వయసులో బాలు తన అభిమానులకు.. స్వరప్రపంచానికి దూరంగా ఉంటూ వైరస్‌తో హోరాహోరీ పోరాడుతునే ఉన్నారు.

ఈ క్రమంలో పలువురు సెలిబ్రిటీలు తమ ట్విటర్‌ వేదికగా ప్రార్థనలు, విషెస్‌లు చేస్తునే ఉన్నారు. నిన్న దర్శకులు భారతీరాజ బాలు ఆరోగ్యం కోసం అందరూ గురువారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు చేయాలని అభిమానులకు, సినీ వర్గాలకు పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు కార్తి, అరుణ్‌ విజయ్, సూరి, ఏఆర్‌ రెహమాన్, మురుగదాస్, కార్తిక్‌ సుబ్బరాజ్, కెఎస్‌ రవికుమార్, గాయకులు హరిహరన్‌ తదితరులు తాము ప్రార్థనలో పాలుపంచుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.మెగాస్టార్‌ చిరంజీవి బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో బాలుతో తన సంబంధం కేవలం సినిమాలకే పరిమితం కాలేదని అంతకన్నా ఎక్కువని తెలిపారు. తను బాలు చాలా ఆత్మీయ స్నేహితులమని.. చెన్నైలో మా ఇళ్ళు దగ్గర్లో ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఎవరింట్లో ఏం జరిగినా తప్పకుండా వెళ్ళేవాళ్ళమని, బాలును తను అన్నయ్యా అని పిలుస్తానని.. బాలు చెల్లెళ్లు తనను అన్నలాగానే భావించి ఆదరిస్తారని...అలాంటి మా బాలు త్వరగా వచ్చేయాలని ఉద్వేగంగా కోరారు. బాలు తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు ఆయనో గొప్ప సుస్వరనిధి అని అన్నారు. తన స్వరమే రాగం, తానం పల్లవి. తన ఆరోగ్యం కోసం ప్రార్థించే కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకణ్ణి అని చిరంజీవి అన్నారు. మా ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయని బాలూ అన్నయ్య మళ్ళీ చిరునవ్వుతో మాకోసం వస్తాడని...తన గాంధర్వ గానంతో మనల్ని అలరిస్తాడని చిరంజీవి ఆకాంక్షించారు.

భారతీ రాజా బాలు కోసం చేసిన ప్రార్థనను షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఒక్కసారిగా తను కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజా బాలు గత 50 ఏళ్లుగా మంచి స్నేహితులు. బాలుకు ఆత్మవిశ్వాసం మెండని భారతీరాజా నమ్మకం. అందుకే బాలు తప్పకుండా కోలుకుని వస్తాడని, ఆ దేవుడు తనను రక్షిస్తాడని తెలిపారు.

ఒక సినీ ప్రముఖులే కాదు సమస్త భారతీయులు బాలుకోసం మౌనంగా ప్రార్థిస్తున్నారు. పలు భాషల్లో 40 వేల పాటలు పాడిన ఈ గానగంధర్వుడు అంటే అభిమానించని వారెవరు! పాడు కరోనా తనను కబళించరాదని, మన బాలు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ మనమధ్యలో రావాలని కోరుకుందాం!!

Next Story