భైంసాలో ఉద్రిక్తత.. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో కర్ఫ్యూ
By Newsmeter.Network Published on 14 Jan 2020 4:48 AM GMTఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పట్టణమంతా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భైంసాలో జరిగిన రెండు వర్గాల ఘర్షణ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఆదిలాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఛలో భైంసా పిలుపు నేపథ్యంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజసింగ్ ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు.
ఖండించిన బండి సంజయ్
నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో హిందువాహిని కార్యకర్తలపై ఎంఐఎం కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులు జరిపి హింసాకాండను సృష్టించారని ఆరోపించారు. 18 ఇళ్లను తగలబెట్టిన కూడా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. హిందువులు సంయమనం పాటిస్తున్నారని... దీనిని ఆసరాగా తీసుకుని దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం దారుణమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి... ఘటనకు కారకులైన వారు పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.