సారీ..ఈసారికిలా కానిచ్చేద్దాం రామయ్య

By రాణి  Published on  17 March 2020 3:44 PM IST
సారీ..ఈసారికిలా కానిచ్చేద్దాం రామయ్య

  • భక్తులు లేకుండానే భద్రాద్రి రామయ్య కల్యాణం
  • మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటన

శ్రీరామ నవమి..ఏటా ఉగాది తర్వాత తొమ్మిదిరోజులకు వచ్చే పండుగ ఇది. ప్రతి ఊరిలో ఉన్న రామాలయాల్లో, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆ రోజు సీతారాముల కల్యాణాన్ని తప్పక చేస్తారు. ఈ కల్యాణ వేడుక ఏకంగా తమ ఇంట్లోనే జరుగుతున్నంత సంబరపడిపోతారు భక్తులు. సీతారాముల కల్యాణానికి భద్రాచలం పెట్టింది పేరు. ఈ పుణ్యక్షేత్రంలో జరిగే కల్యాణాన్ని చూసి తరించేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఈసారి భక్తులు లేకుండానే రాములోరి కల్యాణం జరిపించాల్సి వస్తుందంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా ద్వారా వెల్లడించారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్ రాములోరి కల్యాణం మీద కూడా పడింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకలు ఈసారికి ఆలయ ప్రాంగణానికే పరిమితమవ్వనున్నాయి. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీన జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం ఈ ఏడాదికి భక్తులు లేకుండానే జరుగుతుందని తెలిపారు. కరోనా కట్టడికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. సాధ్యమైనంత వరకూ దూరప్రయాణాలను మానుకోవాలని తెలిపారు.

Next Story