ఇజ్రాయిల్‌ కొత్త ప్రధానిగా బెన్నీ గాంట్జ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2020 7:21 AM GMT
ఇజ్రాయిల్‌ కొత్త ప్రధానిగా బెన్నీ గాంట్జ్‌

ఇజ్రాయిల్‌ కొత్త ప్రధానిగా ప్రతిపక్ష బ్లూ అండ్‌ వైట్‌ పార్టీ నేత బెన్నీ గాంట్జ్‌ను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బెన్నీ గాంట్జ్‌ను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. పార్లమెంట్‌కు ఎన్నికైన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అర్ధరాత్రి వరకూ చర్చలుజరిపిన అనంతరం అధ్యక్షుడు రూవెన్‌ రివ్లిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు అధ్యక్షుడు ప్రధాని నెతన్యాహు, ప్రతిపక్ష నేత గాంట్జ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం అధ్యక్షు రివ్లిన్‌ కొత్త ప్రధానిగా గాంట్జ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. గాంట్జ్‌ సారధ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తన ప్రకటనలో వివరించారు. ఒకే ఏడాదిలో మూడు సార్లు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగినప్పటికీ ఏ ఒక్క పార్టీకీ మెజార్టీ రాక రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో, ఈ పరిస్థితిని అధిగమించేందుకు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ఒక్కటే మార్గమని భావించిన అధ్యక్షుడు రివ్లిన్‌ ఆ దిశగా అడుగులు వేశారు.

మొత్తానికి షేక్‌హ్యాండ్‌ బదులు ‘నమస్కారం’ చేసి కరోనానుంచి కాపాడుకోమని తన ప్రజలకు చెబుతున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తన అధికారాన్ని కాపాడుకోలేకపోయారు. ఏడాదికాలంలో మూడోమారు జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు తిరుగులేని అధికారం ఇవ్వలేదు. నెతన్యాహూ మీద అవినీతి ఆరోపణలున్నాయి. ఆయనా భార్య విలువైన బహుమతులు పుచ్చుకున్నదనీ, అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ఒక పత్రికాధిపతితో నెతన్యాహూ లాలూచీ పడి, ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేయించుకోవడమే కాక, ఆ పత్రిక కోసం దాని ప్రత్యర్థి పత్రికను ఒక చట్టంతో చావుదెబ్బతీశారన్నది ఈ ఆరోపణల సారాంశం. ఒక టెలికాం కంపెనీకి ఆర్థిక లబ్ధి చేకూర్చి అది నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని పొందారన్న ఆరోపణ కూడా ఉంది. గత రెండు ఎన్నికలకు ముందు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అయినా, ఈ ఎన్నికల సమయానికి ప్రాథమిక ఆధారాలున్నట్టు గుర్తించడం, కేసులు పెట్టడం కూడా జరిగిపోయాయి. పలు కారణాలతో వెనుకబడిన నెతన్యాహు చివరికి ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.

మరోవైపు దేశంలో స్థిరమైన ప్రభుత్వం లేకపోవటంతో నానాటికీ విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై పోరు కొనసాగించేందుకు అనువైన పరిస్థితి ఏర్పడలేదు. ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంతో ఈ పరిస్థితికి తెరపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Next Story