తృనమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇద్దరు అక్కాచెల్లెళ్లను రోడ్డుపై ఈడ్చుకుంటూ చితకబాదారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని ఫతానగర్‌లో చోటు చేసుకుంది. స్కృతి కోనదాస్‌, సోమా దాస్‌ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు. స్మృతి పాఠశాలల ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ.. తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటోంది. వీరి ఇంటి ముందు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు 12 ఫీట్ల స్థలాన్ని వదలాలని అక్కాచెల్లెళ్లను గ్రామస్తులు కోరారు. దీనికి వారు అంగీకరించలేదు. తమకున్న భూమిలో ఎక్కువ భూమిని కోల్పోతామని, తాము భూమిని ఇవ్వమంటూ బదులిచ్చారు. అయితే ముందు చెప్పినట్లుగా 12 ఫీట్లు కాకుండా 24 ఫీట్ల స్థలం ఇవ్వాలని తృనమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, గ్రామ పెద్దలు డిమాండ్‌ చేశారు. పైగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు వారు వాహనాలను తీసుకువచ్చారు. దీంతో అక్కా చెల్లెళ్లు వాహనాలను అడ్డుకున్నారు.

స్థలం ఇచ్చినట్లయితే తాము ఎక్కువ మొత్తంలో నష్టపోతామని వారి ముందు వాపోయారు. దీంతో కోపంతో తృనమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు స్మృతి మోకాళ్లకు తాళ్లుకట్టి ఈడ్చుకూంటూ తీసుకెళ్లారు. అడ్డుగా వచ్చిన సోదరి సోమాపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను అక్కడున్నవారు కొందరు సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తృనమూల్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్పిత స్పందించారు ఫతానగర్‌ తృనమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు అమల్‌ సర్కార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. గ్రామస్తులు కొందరు అక్కాచెల్లెళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరు తృనమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.