ర్యాంకింగ్స్‌లో బెన్‌స్టోక్స్‌ దూకుడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 6:45 PM IST
ర్యాంకింగ్స్‌లో బెన్‌స్టోక్స్‌ దూకుడు..

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ దుమ్ములేపాడు. కరోనా అనంతరం ప్రారంభమైన ఇంగ్లాండ్‌-వెస్టిండిస్‌ టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండో టెస్టులో స్టోక్స్‌ ఆట అద్భుతం. ఐసీసీ మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకులను సాధించాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో హోల్డర్‌ 18 నెలల పాటు నంబర్‌ వన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 43,46 పరుగులు చేసిన స్టోక్స్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌‌లో 57 బంతుల్లోనే 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య ఇంగ్లండ్ 113 పరుగులతో గెలుపొంది మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమం చేసింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన బెన్‌ స్టోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో స్టోక్స్ 497 పాయింట్లతో ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లోటాప్‌లోకి దూసుకెళ్లాడు.

వెస్టిండీస్ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ 459 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు రవీంద్ర జడేజా(397) మూడో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్, భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా.. 2006 మేలో మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫింట్లాప్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన తొలి ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా స్టోక్స్‌ రికార్డు నెలకొల్పాడు.

టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 911 పాయింట్లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మొదటి స్తానంలో ఉండగా.. 886 పాయింట్లతో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. 827 పాయింట్లతో బెన్ స్టోక్స్ మూడో స్థానంలో నిలిచాడు. స్టోక్స్ ధాటికి మార్నస్ లబుషెన్, కేన్ విలియమ్సన్ ఒక స్థానాన్ని దిగజారారు.

Next Story