ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
By తోట వంశీ కుమార్ Published on 18 March 2020 8:28 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. కరోనా అంతర్జాతీయ క్రికెట్‌పై పెను ప్రభావమే చూపింది. క్రికెట్ లవర్స్‌ను దశాబ్దానికి పైగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇక ఏప్రిల్ 15 నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయా అనేది అనుమానంగా మారింది. ఈసారి సమ్మర్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు దాదాపుగా లేవని క్రికెట్ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఐపీఎల్‌ను ఓ సీజన్ మొత్తం నిర్వహించకుండా ఉంటే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఐపీఎల్‌ను జూలై-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆసియా కప్ జరగనుంది. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్ పర్యటించనుంది. ఇంగ్లాండ్, పాక్‌ను పక్కన పెట్టేస్తే.. ఆస్ట్రేలియా, వెస్టిండిస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు ప్రత్యేకమైన ముందుగా నిర్ణయించిన పెద్ద సిరీసులు ఏమీ లేదు.
ఆసియా కప్‌ను మినహాయిస్తే టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్.. జూన్, జులైలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మూడేసి వన్డేల సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో మార్పులు చేసి ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి రాని పక్షంలో ఈ సీజన్‌లో ఐపీఎల్ నిర్వహించడంపై బీసీసీఐ ఇప్పటి నుంచే ఫోకస్ చేసింది.