బెంగళూరు: ఆధార్.. అన్నిటికీ తప్పనిసరా..? కాదనే చెప్పింది సుప్రీం కోర్ట్..! ఎవరైతే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను తీసుకుంటున్నారో వారికే ఆధార్ తప్పనిసరి అని తేల్చింది. కానీ బెంగళూరులో పరిస్థితి వేరేలా ఉంది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) ఉద్యోగులు చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఆధార్ చూపించాలని కోరుతున్నారు. ఆధార్ ఒరిజినల్ కానీ.. జిరాక్స్ కానీ చూపిస్తే అప్పుడే శవాన్ని తగులబెట్టడానికి పర్మిషన్ ఇస్తామని చెబుతున్నారు.

గత వారం విజయానగర్ కు చెందిన కె.రాజేష్ అనే వ్యక్తి అత్తగారు చనిపోయారు. శవాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న సుమనహళ్లి శ్మశానవాటికకు తీసుకొని వెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం అందుకు ఒప్పుకోనే లేదట.. చాలా కఠినంగా మాట్లాడారని రాజేష్ మీడియాకు చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని.. అది కూడా తమ అత్త గారి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలని కోరారు. ఇంట్లో ఆమె ఒరిజినల్ ఆధార్ కార్డు కోసం వెతికినా దొరకలేదని.. కనీసం ఫోటోకాపీ లేకపోవడంతో దగ్గర లోని ఇంటర్నెట్ సెంటర్ కు హుటాహుటిన వెళ్లారు. ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ యాక్టివేట్ లో లేకపోవడంతో తిరిగి సమస్య మొదలైందని.. ఎలాగోలా మళ్ళీ మొబైల్ నంబర్ ను యాక్టివేట్ చేయించి ఈ-ఆధార్ ను ప్రూఫ్ గా సబ్మిట్ చేశామని రాజేష్ చెప్పుకొచ్చాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేని అనుభవం అని రాజేష్ అన్నాడు.

బీబీఎంపీ పరిధిలోని 46 శ్మశాన వాటికల్లో 12 చోట్ల విద్యుత్ తో శవాన్ని తగులబెట్టే సదుపాయం ఉంది. సుమనహళ్లి శ్మశానవాటిక సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. తాము శవానికి దహన సంస్కారాలు చేయాలంటే తప్పకుండా ఆధార్ ను ప్రూఫ్ గా అడుగుతామని చెప్పారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌లే ఐడెంటిటీ ప్రూఫ్‌లు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే నగరంలో ఉన్న మిగతా శ్మశాన వాటికలను సంప్రదించగా.. వాళ్ళు కూడా ఆధార్ ప్రూఫ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ ఉండాలని చెప్పారు. ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసే సమయంలో ఆధార్ కార్డు నంబర్ ను తప్పకుండా అప్లోడ్ చేయాలని.. ఆ తర్వాత దహనసంస్కారాల కోసం తీసుకొని వచ్చే సమయంలో ఆధార్ జిరాక్స్ లేదా ఒరిజినల్‌ను తీసుకొని రావాలని అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.