బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా జరుపుకొనే పండగ. ప్రతి ఏటా చెరువులు నిండి ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉన్న సమయంలో బతుకమ్మ పండుగ వస్తుంది. దసరా పండగ ముందు వచ్చే అమావాస్య, అంటే మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకూ తొమ్మిది రోజుల పాటు చేసే ఈ పండగ ఎంతో ప్రత్యేకమైనది.

9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో 'బతుకమ్మ' పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. మన చుట్టూ దొరికే పూలతో అందమైన బతుకమ్మలని పేర్చి లయబద్దంగా అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు.

Image result for బ‌తుక‌మ్మ‌

ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్ని క్రమానుగతంగా పేర్చుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు.

బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం! తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది.

Image result for బ‌తుక‌మ్మ‌

రకరకాల పూలు, ఆకులతో తయారు చేసుకున్న బతుకమ్మలను ఇంటి గుమ్మం వద్ద పూజిస్తారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లతో పాటలుపాడతారు. ఈ చప్పట్ల ద్వారా అమ్మవారిని స్తుతిస్తూ ఆమెకు శక్తినిస్తుంటారు.

మహాలయ అమావాస్య రోజున తెలంగాణ ప్రాంతంలో పితృదేవతలను గుర్తుచేసుకుంటూ బ్రాహ్మణులకు బియ్యం, కాయగూరలూ, ఆకుకూరలూ వంటివన్నీ ఇస్తారు. పెద్దలకు నైవేద్యంగా గారెలు, వడలు, పాయసం కూడా అర్పిస్తారు. ఈ పిండివంటలను పెసలతో చేయడం ఆనవాయితి.

నానపెట్టిన పెసలు, దోసముక్కలను సాయంకాలం బతుకమ్మ దగ్గర ప్రసాదంగా పెడతారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి అవి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే, ఈ బతుకమ్మ ను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story