మన హైదరాబాద్ లో ఓ చిన్న “యెమెన్” దేశం

By సుభాష్  Published on  1 March 2020 1:29 PM GMT
మన హైదరాబాద్ లో ఓ చిన్న “యెమెన్” దేశం

ఎక్కడి హైదరాబాద్... ఎక్కడి యెమెన్... మధ్య బోలెడు దేశాలు,, సముద్రం.... ఇది దక్షిణ భారత దేశపు హృదయం. అది గల్ఫ్ దేశాల్లో ఒకటి. కానీ హైదరాబాద్ కి, యెమెన్ లోని హడ్రమీ రాష్ట్రానికి మధ్య విడదీయరాకుండా ముడివేసుకున్న బంధం ఉంది. చార్మినార్ కి నాలుగు కి.మీ దూరంలో ఉన్న బార్కాస్ లో యెమెన్ లోని హడ్రమీ రాష్ట్రం నుంచి వచ్చి, ఇక్కడి వారుగా మారిన అరబ్బులు ఉన్నారు. మొదట్లో వాళ్లు నిజాం సైన్యంలో చేరారు. వీరికి నిజాం బ్యారక్స్ (నివాస స్థలాలు) కట్టించారు. ఈ బ్యారక్స్ ను అరబ్బులు పలకలేకపోయేవారు. అది క్రమేపీ బార్కాస్ గా మారింది. ఈ ప్రదేశానికి అలా బార్కస్ అన్న పేరు వచ్చేసింది.

ఇప్పటికీ బార్కాస్ కి వెళ్తే యెమెనీ లుంగీలు, అరబ్బీ తలపాగాలున్న వారు కనిపిస్తారు. చాలా కాలం పాటు ఇళ్లలో అరబిక్ భాషే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ ఆ స్థానాన్ని ఉర్దూ ఆక్రమించేసింది. చాలా మంది హడ్రమీలు స్థానిక మహిళలను వివాహం చేసుకోవడంతో నెమ్మదిగా ఇరు సంస్కృతుల మేళవింపుగా మారింది బార్కాస్. ఇలా హడ్రమీలు హైదరాబాద్ కి రావడం అయిదారు తరాలుగా సాగుతోంది. యెమెన్ కి చెందిన 56 తెగల వారు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వీరిని చావూష్ లు అని కూడా అంటారు. వీరి జీవన శైలి భిన్నం. వీరి ఆహారాలు భిన్నం. వీరి టీ కూడా చాలా ప్రత్యేకం. ఇది బ్లాక్ టీ. దీనిని ఘావా అంటారు. టీ పొడి, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలతో మరగకాచి ఇస్తారు. దాదాపు అరవై వేల మంది హడ్రమీలు బార్కాస్ లో నివసిస్తున్నారు. ఇలాగే ఔరంగాబాద్, కర్నాటకలోని భట్కల్ వంటి నగరాల్లోనూ యెమెనీలు ఉన్నారు. మన దేశంలో వీరి జనాభా దాదాపు మూడు లక్షల వరకూ ఉంటుంది.

వీరితో పాటు వీరి సంప్రదాయ డప్పుల నృత్యం మర్ఫా కూడా వచ్చింది. ఈ మర్ఫా నుంచి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఫేమస్ తీన్ మార్ వచ్చింది. అలా వారి డప్పుల లయకు మనం నాట్యం చేస్తున్నామన్నమాట. యెమెనీలకు ఇప్పటికీ యెమెన్ లోని మంది, ఫూల్ (ఫావా బీన్ల కూర), హరీసా, కబ్సా వంటి వంటకాలంటే ఎంతో ఇష్టం. ఇలా మన నగరానికి కొత్త సొబగులు యెమెనీ మూలానికి చెందిన ఈ హడ్రమీలు అద్దారు.

Next Story