'బంగ్లాదేశ్ యువతి'ని దేశం విడిచిపొమ్మన్న కేంద్ర హోంశాఖ

By అంజి  Published on  29 Feb 2020 2:49 AM GMT
బంగ్లాదేశ్ యువతిని దేశం విడిచిపొమ్మన్న కేంద్ర హోంశాఖ

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంతో దేశం విడిచి వెళ్లాలంటూ బంగ్లాదేశ్‌ యువతికి కేంద్ర హోంశాఖ తాజాగా నోటీసులు జారీచేసింది. వివరాల్లోకెళ్తే.. బంగ్లాదేశ్‌కు చెందిన అఫ్సారా అనికా మీమ్‌ అనే విద్యార్థిని పశ్చిమ బెంగాల్‌లోని విశ్వ భారతి యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనర్‌ విభాగంలో 2018నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ చేస్తోంది. అయితే, క్యాంపస్‌లో జరుగుతున్న సీఏఏ ఆందోళనలు, నిరసనలకు అనుకూలంగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులు చేసింది. ఇప్పుడు అఫ్సరాకు కోల్‌కతాలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి లీవ్‌ ఇండియా నోటీస్‌ అందింది.

ఫిబ్రవరి 14న జారీచేసినట్లు ఉన్న ఈ నోటీసులు బుధవారం అఫ్సరా అందుకున్నట్లు తన తోటి విద్యార్థులు వెల్లడించారు. 'మీరు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించాం, ఇలాంటి కార్యకలాపాలు వీసా నిబంధనలకు విరుద్ధం’ అని విదేశాంగ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులు భారత్‌లో ఉండటానికి వీలులేదు. నోటీసులు అందుకున్న 15రోజుల్లో మీరు దేశం విడిచి వెళ్లాలని నోటీసులో తెలియజేసింది.

Bangladesh girl leave India notice

కొన్ని రోజుల క్రితం సీఏఏ అంశంపై ఆమె పోస్టులపై తోటి విద్యార్థులు ట్రోల్‌ చేస్తూ దేశ ద్రోహిగా అభివర్ణించారు. దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు ఆమె పోస్టుకు వ్యతిరేకంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోస్టులపై వివరణ ఇవ్వల్సిందిగా.. ఎఫ్ఆర్ఆర్ఓ ఆమెను ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడటం, వీసా నియమాలను ఉల్లంఘనేనని ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది.

కానీ తాను మాత్రం ఎలాంటి తప్పు చేయాలేదనీ, పౌర నిరసనల్లో పాల్గొనకుండానే తన స్నేహితులు తనను ట్రోల్‌ చేశారని ఆమె వాపోయింది. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులను విజ్ఞప్తి చేసింది. ఇదేరకమైన సంఘటన డిసెంబరులో జరిగింది. మద్రాస్‌లోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్న ఓ జర్మన్‌ విద్యార్థి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్నాడు. దీంతో వీసా నిబంధనలను ఉల్లంఘించాడని ఆయనను తన దేశానికి తిరిగి పంపించారు.

Next Story