ముఖ్యాంశాలు

  • గుంటూరులో పరిస్థితి ఉద్రిక్తం
  • స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారులు
  • విద్యాసంస్థలు మూసివేత
  • బంద్ వల్ల ప్రజలకు ఇబ్బందన్న రెండు జిల్లాల పోలీస్ యంత్రాంగం

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఉదయం నుంచి ఎక్కడికక్కడ షాపులు మూసివేశారు. విద్యా, ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళనలకు దిగాయి. గుంటూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కాలేజీ, స్కూల్ బస్సులను అడ్డుకున్నారు. టీడీపీ నేతలు అక్కడే నిరసన తెలిపారు. రోడ్లపై టైర్లు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. దీంతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో..ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లాలో కూడా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల దీక్షలు, ఆందోళనలు యధావిధిగా కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును వెనక్కి తీసుకోకపోతే నిరంతర నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమని చెప్తున్నారు మహిళా రైతులు. ఇదిలా ఉంటే..అసలు బంద్ చేసేందుకు అనుమతులు లేవని ఆ రెండు జిల్లాల పోలీసులు చెప్తున్నారు. బంద్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. స్వచ్ఛందంగా కాకుండా ఎక్కడైనా వ్యాపారాలను, స్కూళ్లు, కాలేజీలను బలవంతంగా మూయిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దొంగ నాయకుడు జగన్

విశాఖకు రాజధాని తరలిపోతుండటంతో..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో నిరసన సెగలు మిన్నంటుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసులను ఆయా ప్రాంతాలకు మోహరించింది. అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును పాస్ చేసినప్పటి నుంచి రైతుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఎక్కడికక్కడ పోలీసుల పహారా ఉన్నా అదేమీ లెక్కచేయని రైతులు.. రెండ్రోజుల క్రితం పొలాల మీదుగా వచ్చి అసెంబ్లీని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. జగన్ చేసేది తప్పు కాబట్టే దొంగలా ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నిజాయితీ గల నాయకుడైతే ఇలా దొంగ పనులు చేయడంటున్నారు.

మండలి రద్దు అంత ఈజీ కాదు..

మంగళవారం రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన శాసన మండలిలో ప్రవేశపెట్టగా..దానిపై చర్చ జరిపేందుకు మండలి టీడీపీ సభ్యులు ఇష్టపడలేదు. రూల్ 71 ప్రకారం చర్చ జరిపాలని మంత్రి వాదించినా లాభం లేకపోయింది. మండలి సమావేశం ప్రారంభంలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం కొసమెరుపు. ఆ తర్వాత మండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావించినప్పటికీ..అది సాధ్యం కాలేదు. మండలిని రద్దు చేయడం అంత సాధ్యం కాదని తెలుసుకున్న ప్రభుత్వం బిల్లుపై మండలిలో చర్చించేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. ఫలితంగా టీడీపీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరింది. టీడీపీ కోరినట్లు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపితే..మూడు నెలల సమయం పడుతుంది. అంతవరకూ సీఆర్డీఏ రద్దు అవ్వదు. సచివాలయాన్ని విశాఖకు తరలించే అధికారం వైసిపికి ఉండదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.