వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 5:56 AM GMT
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి..!!

  • వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
  • మల్కాజ్‌గిరి పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు
  • వ్యాక్సిన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ల్యాబ్‌కు తరలించి నివేదిక తీసుకుంటామన్న పోలీసులు

హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ వికటించడంతో 3 నెలల బాబు మరణించాడు. అంగన్‌వాడీ సెంటర్‌లో వేసిన వ్యాక్సిన్‌ వికటించడం మూలంగానే తమ పిల్లాడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మాల్కాజ్ గిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

మల్కాజిగిరి లో నివాసం ఉండే సాయిబాబా, లావణ్య కు 3 నెలల క్రితం బాబు జన్మించాడు.

బాబుకు వ్యాక్సిన్ వేయించడానికి దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లారు. అంగన్‌వాడీ కేంద్రంలో వ్యాక్సిన్‌ వేయించారు. వ్యాక్సిన్‌ వేయించిన మూడు గంటల్లోనే చిన్నారి పరిస్థితి విషమించడం ప్రారంభించింది. శరీరం వేడెక్కడంతోపాటు..చిన్నారి ఎరుపు రంగులోకి మారిపోయాడు. ఇదేంటని బాబు తల్లిదండ్రులు అంగన్‌వాడీ సిబ్బందిని అడిగారు. వ్యాక్సిన్‌ వేసినప్పుడు జ్వరం రావడం సర్వసాధారణమని..తడిగుడ్డతో ఒంటిని తడువమని సూచించి చిన్నారి తల్లిదండ్రులను పంపించేశారు.

ఇంటికి వెళ్లిన తరువాత జ్వరం తీవ్రం కావడంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.దీంతో చిన్నారి తల్లిదండ్రులు భయపడి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాని..అప్పటికే బాబు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బాబు చనిపోయాడని తల్లిదండ్రులు మల్కాజ్ గిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. వాక్సిన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాక్సిన్‌లను ల్యాబ్ కు పంపించి నివేదిక తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story