బాబు స్నేహితుడు జంప్?
By Newsmeter.Network Published on 12 March 2020 10:27 AM ISTస్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి టీడీపీని కోలుకోలేని దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రధాన అస్త్రమైన ఆపరేషన్ ఆకర్స్‌ను ప్రయోగించడం ద్వారా టీడీపీలోని కీలక నేతలను జగన్ వైసీపీలోకి లాగేస్తున్నారు. ఇన్నాళ్లు టీడీపీలోని ఒకరిద్దరి నేతలను మినహా మిగిలిన వారి జోలికి వెళ్లని జగన్మోహన్‌రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి టీడీపీలోని ముఖ్యనేతలనే టార్గెట్‌గా తన ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి సీనియర్ నేతలుగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పలువురు వైసీపీ కండువా కప్పుకున్నారు.
వీరివరకు బాగానేఉన్నా.. కరుడుకట్టిన టీడీపీ నేతలుసైతం ఇప్పుడు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతుండటం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. జమ్మలమడుగుకు చెందిన టీడీపీ నేత రామసబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాక టీడీపీ కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతుంది. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆయన సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నట్లు విస్త్రృత ప్రచారం సాగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నామినేషన్లకు కరణం బలరాం అందుకే దూరంగా ఉన్నారని తెలుస్తోంది. చీరాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్‌పై పోటీచేసిన కరణం.. 17,801 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభకు బలరాం ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా ముందుండి నడిపించే వ్యక్తి బలరాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైకాపాలో చేరుతున్నారనే ప్రచారాన్ని టీడీపీ శ్రేణులను జీర్ణించుకోలేని అంశంగా మారింది.
ఇప్పటికే బలరాం వైసీపీ నేత బాలినేనితో మంతనాలు జరిపినట్లు ఏపీలో చర్చ సాగుతుంది. ఆ చర్చలు సఫలం కావడంతో గురువారం వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి కలిసేందుకు సిద్ధమయ్యారనే వార్త సోషల్ మీడియాలోనూ, వాట్సాప్ గ్రూప్‌లలోనూ హల్‌చల్ చేస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న బలరాం నిజంగా వైకాపాలోకి వెళ్తున్నా..? లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలేఅవకాశముంది.