అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రికను చూశారా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 8:08 AM GMT
అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రికను చూశారా..?

అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్న కార్డు కాషాయం రంగులో ఉంది. భారత ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ రావ్ భగవత్ పేరుఉండగా.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అయోధ్య రామ మందిర భూమి పూజ మహోత్సవానికి చాలా తక్కువ మందిని ఆహ్వానించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూడాలని చాలా మందికి ఉంటుందని.. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఇక్కడికి రాకండి అంటూ ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అందుకోసమే ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు.

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోడి శంకుస్థాప‌న చేయనున్నారు. అయిదు వెండి ఇటుక‌ల‌తో భూమి పూజ నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు.

భూమి పూజలో ఈ వెండి ఇటుకను వాడనున్నారు. వెండి ఇటుక ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ నఖ్వా. ఈ ఇటు బరువు 22 కేజీల 600 గ్రాములని తెలిసింది. ఈ పునాది రాయిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఆగస్టు 5న మధ్యాహనం 12 గంటల 15 నిమిషాల 15 సెకండ్లకు వేస్తారని గతంలో పోస్టు చేశారు. మొత్తం 40 కేజీల వెండి ఇటుకను వాడే అవకాశాలు ఉన్నాయని కథనాలు కూడా వచ్చాయి.

Next Story