కోవిడ్ వైరస్ భయం.. ఆస్ట్రియా సరిహద్దుల్లో ఆగిన రైలు
By అంజి
వుహాన్: చైనాలో కోవిడ్ వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ కారణంగా చైనాలో నిన్న ఒక్క రోజే 150 మంది మృతి చెందారు. దీంతో కోవిడ్ వైరస్ మృతుల సంఖ్య 2,592కు పెరిగింది. కొత్తగా 409 మందిలో కోవిడ్ వైరస్‌ను గుర్తించినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ కమిషన్ పేర్కొంది.
తాజాగా కోవిడ్‌కు వైరస్‌కు బలైన వారిలో ఒక్కరు తప్ప మిగతావారంతా హుబెయ్ ప్రావిన్స్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే వుహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పర్యటిస్తోంది. వుహాన్ నగరంలోని ఆస్పత్రులను సందర్శించి రోగుల పరిస్థితిని నిపుణులు తెలుసుకుంటున్నారు. కోవిడ్ వైరస్ సోకలేదని నిర్దారణ అయిన వ్యక్తలను వుహాన్ నుంచి వెళ్లిపోయేందుకు చైనా అధికారులు అనుమతి ఇస్తున్నారు.
దక్షిణ కొరియాలోనూ కోవిడ్ వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇక్కడ మరో 161 మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో కోవిడ్ కేసుల సంఖ్య 763కు చేరింది. మృతుల సంఖ్య ఏడుకు చేరగా.. ఎక్కువగా డేగు నగరంలో కోవిడ్ వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. దక్షిణ కొరియా ప్రస్తుతం ఓ భయంకర పరిస్థితిని ఎదుర్కొంటోందని, కోవిడ్‌పై పోరాడేందుకు రానున్న రోజులు కీలకంగా మారనున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే-ఇన్ అన్నారు.
చైనాతో సరిహద్దు పంచుకోని ఇటలీ దేశంలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ 152 మందికి కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. కోవిడ్ వైరస్ విజృంభించకుండా నియంత్రించేందుకు వెనిస్ కార్నివాల్‌ను అధికారులు రద్దు చేశారు. వెనిస్ నుంచి పక్క దేశామైన ఆస్ట్రియాకు ఒక రైలులో వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులకు జ్వరం లక్షణాలు ఉండడంతో ఆ రైలును ఆస్ట్రియా సరిహద్దు దగ్గర నిలిపివేశారని బీబీసీ తెలిపింది. అయితే వారిద్దరికి కోవిడ్ వైరస్ సోకలేదని ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రి కార్ల్ నేహామర్.. తమకు చెప్పారని బీబీసీ తెలిపింది. న్యూజిలాండ్‌లో చైనా పర్యాటకులపై నిషేధం విధించారు.
కోవిడ్ ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి పడిపోయాయి. ఇరాన్‌లో 43 కోవిడ్ వైరస్ కేసులు నమోదు అయినట్లు తెలిసింది.
కాగా జపాన్‌లోని యెకోహామా పోర్టులో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో దాదాపు 600 మందికి కోవిడ్ వైరస్ సోకింది.