ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కరోనా..? తొలి వన్డేకి దూరం..
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 7:40 AM GMTకివీస్‌తో వన్డే సిరీస్‌కి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడికి పరీక్షలు నిర్వహించగా కొన్ని కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఏ న్యూజిలాండ్‌తో తొలి వన్డే నుంచి ఆ ఆటగాడిని తప్పించింది.
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన పేసర్ కేన్ రిచర్డ్‌సన్ గురువారం రాత్రి తన గొంతులో మంటగా ఉందని టీమ్ వైద్య సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అతడికి జట్టుకు దూరంగా ఉంచి కొన్ని పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కొన్ని కనపడడంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు.
ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ' అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించట్లేదని, టికెట్లు కొన్నవారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని సీఏ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్‌లో రిచర్డ్‌సన్ ఆర్‌సీబీ(రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు) జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఈ ఆటగాడిని ఆర్‌సీబీ రూ.4కోట్లకు సొంతం చేసుకుంది. ఇక తొలి వన్డేలో కేన్ విలియమ్‌సన్‌కు బదులు సీన్ అబాట్‌ను ఎంపిక తీసుకున్నారు.
�