ఆసీస్‌దే మహిళల టీ20 వరల్డ్‌కప్..
By తోట వంశీ కుమార్ Published on 8 March 2020 3:46 PM ISTతొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని అనుకున్న భారత జట్టు ఆశ నెరవేరలేదు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత జట్టు 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైయ్యింది. దీంతో ఆసీస్ ఐదో సారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.
ఓపెనర్ల విధ్వంసం..
అంతముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. అలీసా హీలీ (75; 39బంతుల్లో 7పోర్లు, 5 సిక్సర్లు) బెత్ మూనీ(78; 54బంతుల్లో 10పోర్లు) మొదటి వికెట్‌కు 11.4ఓవర్లలోనే 115 పరుగులు జోడించారు. ఓవర్‌కు కనీసం ఒకటి రెండు బౌండరీలు సాధిస్తూనే సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సెంచరీ సాధించేలా కనిపించిన హీలిని 12వ ఓవర్‌లో రాధా యాదవ్ బోల్తా కొట్టించింది. ఊరించే బంతి వేయడంతో హీలి భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద వేదా కృష్ణమూర్తి చేతికి చిక్కింది. తర్వాత కెప్టెన్ మెగ్ లానింగ్(16) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా శిఖా పాండే బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
అదే ఓవర్‌లో ఆష్లీగార్డ్‌నర్ (2) స్టంపౌటవ్వడంతో ఆసీస్ 156 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చివర్లో రేచల్(4)ను పూనమ్ బౌల్డ్ చేసింది. బెత్‌మూనీ చివరి వరకు క్రీజులో ఉండి ఆసీస్ స్కోరును 184 పరుగులకు చేర్చింది. టీమిండియా పస లేని బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్ ఆసీస్‌కు కలిసొచ్చింది. హీలికి 9 పరుగుల వద్ద, మూనీలకు 4 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ చెరో వికెట్ ను పడగొట్టారు.
చేతులెత్తేసిన బ్యాట్ఉమెన్స్..
భారీ లక్ష్య చేధనకు బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే వరుస దెబ్బలు తగిలాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న షెఫాలీ(2).. షట్ బౌలింగ్‌లో కీపర్ హీలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన తానియా తలకి బంతి తగలడంతో రెండో ఓవర్‌లోనే రిటైర్‌హార్ట్‌గా వెనుదిరిగింది. బ్యాటింగ్‌కు వచ్చిన జెమీయా పరుగుల ఖాతా తెరకుండానే పెవిలియన్ చేరింది.
మరో ఓపెనర్ స్మృతి మంధాన(11), కెప్టెన్ హర్మన్ ప్రీత్(4) కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా 5.4 ఓవర్లలో 30పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. వేదా కృష్ణ మూర్తి(19), దీప్తి శర్మ(33) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ధాటిగా ఆడే క్రమంలో వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. అనంతరం వచ్చిన వారు వచ్చినట్లుగానే పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకొచ్చిన భారత మహిళల జట్టు ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. దీంతో ఆసీస్ ఐదోసారి సగ్వరంగా కప్‌ను ముద్దాడింది.