ఆస్టన్‌ ఆగర్‌ హ్యాట్రిక్.. ఘోర ఓటమిని చవిచూసిన సౌతాఫ్రికా

By Newsmeter.Network  Published on  22 Feb 2020 7:02 AM GMT
ఆస్టన్‌ ఆగర్‌ హ్యాట్రిక్.. ఘోర ఓటమిని చవిచూసిన సౌతాఫ్రికా

ఆసీస్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ హ్యాట్రిక్‌తో విజృభించడంతో.. తొలి టీ20లో దక్షిణాఫ్రికా జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆగర్‌ ధాటికి 14.3 ఓవరల్లో 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. 107 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

బ్యాట్స్‌మెన్ల విజృంభన :

టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. ఆసీస్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. 2018లో బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్లీ ఈ సిరీస్‌తో ఆ గడ్డపై అడుగుపెట్టారు. డేవిడ్‌ వార్నర్ (4; 2 బంతుల్లో 1పోర్‌) తొందరగానే పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్ అరోన్ ఫించ్ (42: 27 బంతుల్లో 6పోర్లు, 1సిక్స్‌) కు స్టీవ్‌ స్మిత్(45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) జతకలిసాడు. వీరిద్దరు ఎడా పెడా బౌండరీలు బాదడంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. రెండో వికెట్‌కు వీరిద్దరు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు స్వల్ప విరామాల్లో ఔటైనా.. చివర్లో.. అలెక్స్ క్యారీ (27: 22 బంతుల్లో 3పోర్లు, 1సిక్సర్‌), ఆస్టన్‌ ఆగర్‌ (20 నాటౌట్: 9 బంతుల్లో 2పోర్లు, 1సిక్స్‌) బ్యాట్‌ ఝళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లో ఆసీస్‌ 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఆస్టన్‌ ఆగర్‌ హ్యాట్రిక్‌ :

197 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ డికాక్ (2) తొలి ఓవర్‌లోనే క్లీన్‌బౌల్డ్‌ కాగా.. వాన్‌ డెర్‌ డస్సెన్‌ (6), స్మట్స్‌ (7), డేవిడ్‌ మిల్లర్‌ (2)లు తీవ్ర నిరాశ పరచడంతో 14.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఇటీవల కెప్టెన్సీని వదులుకున్న డుప్లెసిస్ (24: 22 బంతుల్లో 3పోర్లు) కగిసో రబాడ (22: 19 బంతుల్లో 1పోర్‌, 2సిక్సర్లు) కాస్త రాణించడంతో సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పరుగుల పరంగా(107 పరుగులు) టీ20 చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇదే అతి పెద్ద పరాభవం. గతంలో పాకిస్తాన్‌, ఆసీస్‌లపై 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

దక్షిణాప్రికా పతనంలో ఆస్టన్‌ ఆగర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు. హ్యాటిక్ర్‌ వికెట్లతో రాణించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఆగర్‌.. వరుస బంతుల్లో డుప్లెసిస్, ఆండిలే (0), డేల్ స్టెయిన్ (0) రూపంలో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఆసీస్‌ తరఫున టీ20ల్లో అత్యధిక బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. గతంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించగా, ఇప్పుడు అతని సరసన ఆగర్‌ చేరాడు. 2016లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20లో ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించాడు. ఇప్పటివరకూ ఆసీస్‌ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ కాగా, నాలుగేళ్ల తర్వాత ఆగర్‌ ఆ మార్కును అందుకున్నాడు. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Next Story
Share it