ఆగస్టు 2 నుండి 8వ తేదీ వరకు రాశి ఫలితములు

By జ్యోత్స్న  Published on  2 Aug 2020 3:57 AM GMT
ఆగస్టు 2 నుండి 8వ తేదీ వరకు రాశి ఫలితములు

మేష రాశి :- ఈ వారంలో వీరికి సౌఖ్యము లాభము కాస్తంత అనుకూలంగా ఉన్నాయి. ఐనా ఈ రాశి వారికి లాభం చేకూర్చే వాడు కుజుడు వ్యయమందు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రవి శనులు ఒకరినొకరు చూసుకోవడం వల్ల రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. పంచమాధిపత్యం వచ్చిన రవి వీరికి మేలు చేసే స్థితిలో లేడు .భాగ్య వ్యయాధిపతి అయిన గురువు మాత్రమే వీరికి సానుకూలమైన పనిచేసి పెట్టి ఆనందం కలగజేస్తాడు. వారం చివరలో వీరికి వ్యయం ఎక్కువగా ఉన్నది. ఆరోగ్య విషయంలో శుక్రుడు ద్వితీయము నందు ఉండటం వల్ల కూడా వీరికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారంలో కొత్త ప్రయత్నాలు ఏమి కూడా చేయకండి. వాటి వల్ల ప్రయోజనాలు చేకూరే అవకాశం లేదు . మీ జాతకానికి భద్రత కూడా బాగా తక్కువగా ఉంది జాగ్రత్త వహించండి . అశ్వనీ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది మంచి ఫలితం కనిపిస్తోంది. కృత్తిక ఒకటో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్య సమస్యలు ఇవ్వ నున్నాడు .

పరిహారం :- సోమవారం నాడు హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణిమ అంటాము ఏదేవతలకు ఏపూజలైనా శుభఫలితాలు ఇస్తాయి. 7వ తేదీ గణపతి పూజ చేయండి.

వృషభ రాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ద్వితీయ మందున్న యోగకారకుడైన శుక్రుడు మీకు మంచి లాభాన్ని ఇవ్వనున్నాడు. ఏది అనుకుంటే అది జరిగే అవకాశం ఉంది. శని బుధ శుక్రులు మీకు మేలు చేకూరుస్తున్నారు. దీని ఫలితంగా మీరు ఎన్నడూ లేనంత మంచి మంచి విజయాలను పొందుతారు. కొత్త వ్యక్తులను కలుసుకొని వారిద్వారా మరింత లాభాన్ని పొందగలుగుతారు. మీ ఆలోచన విధానము మారుతుంది. దాని ఫలితంగా కార్యాచరణ మారి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. ద్వితీయ మందున్న రాహువు మాత్రం మీరు అసంకల్పితంగా మాట్లాడటం ద్వారా జరగబోయే పనులకు ఆటంకాల్ని కల్పిస్తాడు. దీని ద్వారా మీరు అధికారులు యొక్క కోపానికి గురికావలసి వస్తుంది. కొంత ఆర్థిక వ్యయం అయినప్పటికీ మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కృత్తిక 2 3 పాదాల వారికి జన్మతార అయింది ఫలితంగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార అయింది ఫలితాలు బాగున్నాయి. మృగశిర 1,2 పాదాల వారికి మిత్ర తార అయింది ఫలితాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి.

పరిహారం:- శనికి జపం చేయించండి. నువ్వులు దానం చేయించండి. మంచి బ్రాహ్మణునకు వస్త్రము దానం చేయండి. హయగ్రీవ స్తోత్రం చేయండి.

మిధున రాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాలు చాలా తగ్గాయి. అనవసరమైన భయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మీ తప్పులు మీరు దిద్దుకుంటే ఫలితాలు మంచిగా కనిపిస్తాయి. బుధ గురువులు అనుకూలించాలి అంటే మెదడుకు పదును పెట్టండి. వ్యక్తిగతంగా అలోచిస్తే గురుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇతరుల ప్రభావము మీపై ఎక్కువగా పని చేస్తున్నది. ఈ వారంలో శని బుధ రాహువులు మీకు చాలా ఇబ్బందుల్ని కలుగజేస్తారు. ఒకానొక సమయంలో మీరు అనారోగ్యపు అంచుల్ని చవి చూస్తారు. తద్వారా ధన వ్యయము చాలా ఎక్కువ అవుతుంది. భయం ఓ ప్రక్క మిమ్మల్ని వెంటాడుతుంది. పదే పదే మీకు మీ ఆత్మీయులు సలహాలు ఇవ్వజూస్తారు. పంతాలు పట్టింపులకు పోకండి. నష్టపోతారు. సన్మార్గంలో పెట్టే అవకాశానికి శుక్రుడు కారకత్వం వహిస్తున్నాడు వినియోగించుకోండి. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింప జేస్తాయి. మృగశిర 3, 4 పాదాలు వారికి మిత్ర తార అయ్యింది ఫలితాలు చాలా బాగున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. పునర్వసు 1,2,3 పాదాల వారికి సాధన తార అయింది. మంచి ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం :- శని చంద్రులకు జపాలు హోమాలు చేయించండి. బియ్యం, నువ్వులు దానాలు చేయించండి. సొమవారం నాడు హయగ్రీవ స్తోత్రం ప్రారంభం చేసి రోజూ పారాయణ చేయండి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభం ఉత్సాహము మిమ్మల్ని ఆనందింప చేస్తాయి. మానసిక స్థాయిలో ధైర్యం లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. విశేషించి మీ ఆలోచనలను మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. ఒకరిద్దరి మిత్రుల అనుకూల వాతావరణ పరిస్థితులు మీకు చాలా మంది వ్యక్తుల పరిచయాన్ని ముందుకి నడిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మీ ఆలోచనకి తగ్గ వ్యక్తులుగాని విషయంగాని లభించక చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాలు కూడా ప్రతికూలత ఎక్కువగా ఉంది. మీరు జాగ్రత్త పడకపోతే దాని ప్రభావం వేరే రకంగా పరిణమిస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం లో సమయాన్ని కేటాయిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా దైవము తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు పూర్తి సహకారం అందించ లేరు. ఇది గుర్తు పెట్టుకుంటే మీకు చాలా మంచి రోజులు ఉన్నట్లే లెక్క. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం లో జాగ్రత్తలు తీసుకొండి. ఇది ఒక హెచ్చరికగా కూడా మీరు భావించాలి సమయానికి అందుబాటులో వ్యక్తులు గాని ధనము గాని ఉండని పరిస్థితి ఈ వారంలో మీకు ఉంది. పునర్వసు నాలుగో పాదం వారికి సాధన తార అయింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది ప్రతికూల స్థితిఎక్కువ. ఆశ్లేష నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది. కాబట్టి పరిస్థితులు మంచి బాగానే ఉన్నాయి.

పరిహారం :- నవగ్రహాలకు జపము స్తోత్ర పారాయణ ప్రదక్షణలు ఈ వారం రోజులు చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే కొంత సాధించగలరు. రుద్రాభిషేకం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహరాశి :- ఈ రాశి వారికి ఈ వారం అన్ని గ్రహాలు యోగించనున్నాయి. లాభము ఆనందం సకల సంపదలు విశేష ధన స్థితి ఉన్నాయి. వీటితో ఉక్కిరి బిక్కిరి అవుతారు. రవి వ్యయం లో ఉన్న కారణంతో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. కుజు గ్రహ స్థితి వల్ల కుటుంబంలో ఎవరో ఒకరికి శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉన్నది. గురుడు శుక్రుడు బుధుడు వీరు మీకు నిరంతరము రక్షా కవచాల్లా ఉంటారు. ఎందుకైనా మంచిది కుటుంబ పెద్ద ఆరోగ్యాన్ని గూర్చి జాగ్రత్తలు తీసుకోండి. మాతృస్థానం కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. వారాంతంలో చంద్రగ్రహ స్థితి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అనవసరమైన భయాలకు లోను కాకుండా ఉండడానికి భగవన్నామస్మరణమే మంచి మార్గం.

మఖా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతికూల వాతావరణం ఉన్నది. పుబ్బానక్షత్ర జాతకులకు సంపత్తారైంది సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదంవారికి జన్మ తార అయింది. అనారోగ్య సూచనలు ఉన్నాయి

పరిహారం :- రవికి జపము సూర్య నమస్కారాలు చాలా అవసరము. కుజునకు కూడా జపం చేయించండి కందులు దానం చేయండి ఎర్రని వస్త్రం దానం చేయండి.మంచి ఫలితాలు పొందుతారు.

కన్యారాశి :- ఈ రాశి వారికి ధన లాభం సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు. రవి ధనలాభంకలిగిస్తూ ఉన్నప్పటికీ కుజ గురులు ఇద్దరూ మీకు ప్రతికూలంగా పని చేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చంద్రుడు మొదట్లో కార్యహాని కలిగిస్తాడు. అయినా అత్యధిక గ్రహాల ప్రభావం చేత మానసికంగా ధైర్యం పొందగలిగితే కొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభావం చేత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. శుక్రుడు కూడా సంతోషాన్ని ఇస్తాడు. బుధ గురులు సంతోషం ఇచ్చి మీకు మంచి ఉత్సాహాన్నిచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా మీకు 45 శాతం మాత్రమే అనుకూలత ఉంది. ఎక్కడికి పోయినా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మీరు నెరవేర్చుకునే స్థితి గతి పొందే ప్రయత్నంలో ఉండండి. దానివల్ల మీకు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకోసమే మీరు స్థిరంగా నిలబడి కూడా సంతోషంగా ఉంచుకొనే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఇబ్బంది పడిన బయటికి చెప్పకుండా ఉన్నట్లయితే వాటి వల్ల మీకు సలహా ఇచ్చే వాళ్ళు తగ్గుతారు దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది మీ సలహాలు ఎవరికి అవసరం లేదు కాబట్టి మీ ఆలోచనా విధానం మీరు మార్చుకోండి. ఉత్తర 2, 3, 4 పాదాలు వారికి జన్మతార అనారోగ్య సూచన ఉంది. హస్తా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార మంచి ఫలితాలున్నాయి. చిత్త 1, 2 పాదాలు వారికి మిత్ర తార అయ్యింది మంచి ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- గురు చరిత్ర పారాయణ చేయండి. గురువు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్తోత్రం గాని హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి.

తులా రాశి :- ఈ రాశివారికి ఈ వారం కార్య జయము, ధాన్య వృద్ధి మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. చంద్రుడు కూడా మీకు ధన లాభాన్ని సూచిస్తున్నాడు. కుజుడు కూడా మీకు ధనప్రాప్తి కలిగిస్తాడు. శని చంద్రుల స్థితి వలన అనారోగ్య సూచన ఉంది. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు పడవలసి వస్తుంది. అయితే బుధ గురులు మీకు వ్యతిరిక్తంగా పనిచేస్తున్నారు కాబట్టి మీ కష్టానికి తగిన ఫలితాలు లభించవు. గురు అనుగ్రహం మీపై వ్యతిరిక్తంగా ఉంది కాబట్టి ఏదో ఒక చిన్న కష్టాన్ని మీరు పొందక తప్పదనే అనిపిస్తోంది. ఎన్ని ఉన్నా ఏదో ఒక సమస్య వెన్నంటి ఉంటుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో కల్పించుకోకండి. దేనికి పరిష్కారం కోసం వెళ్ళకండి. దాని వల్ల మీకు కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఇప్పుడు శత్రువులు పెరుగుతున్నారు. మీ దృష్టి వారిపై కేంద్రీకరించండి. రవి శనుల పరస్పర దృష్టి మీ పనులకు కొంత ఆటంకంగా నిలుస్తుంది. చిత్త మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది చాలా సానుకూలంగా ఉంది. కు స్వాతి నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది అనారోగ్య సూచనలు ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తార అయింది అనుకూల ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- ఈ రాశివారు చంద్రునికి ప్రార్థిస్తే సద్యో ఫలితాలు కలుగుతాయి. బుధ గురులకు వీలైనంత వరకు దర్శనం చేసి పెసలు శెనగలు నైవేద్యం పెట్టండి. రుద్రాభిషేకం మంచిఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి :- ఈరాశి వారికి ఈ వారం ధనలాభం భూసంపద మీకు ఆనందాన్ని సుఖ సౌఖ్యాలు కొంతవరకు ఇస్తాయి. వారం ప్రారంభం లో ధన లాభం ఉంది. కుజ గురుల ప్రభావము వల్ల బాగా పరిచయం ఉన్న వారే శత్రువులుగా మారే అవకాశం ఉంది. తెలిసిన వారు కావడం వల్ల అతి సులువుగా మిమ్మల్ని మాటలతోగానీ చేతలతో గానీ బాధించడం జరుగుతుంది. మానసిక బలానికే కాదు నూతన కార్యాలు తల పెట్టడానికి కూడా చంద్రుని స్థితి అనుకూలంగా లేదు. . . తెలిసిన వారు కావడం వల్ల అతి సులువుగా మిమ్మల్ని మాటలతోగానీ చేతలతో గానీ బాధించడం జరుగుతుంది. శుభ ఫలితాలు పెద్దగా గోచరించడం లేదు. .శుక్రుడు మీకు భూసంపద ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బుధుడు శుభ గ్రహమైన శుక్రునితో కలసి ఉండటం, స్వక్షేత్ర వర్తి కావడం వల్ల మీ కోరికలను తప్పక నెరవేరుస్తాడు. అయితే సంపాదించిన దానికి ఖర్చు అక్కడికది సరిపోతుంది. ఏదో ఒక కారణంతో డబ్బుని కొద్దిగా పోగొట్టుకుంటారు. భాగ్యం లో రవి మీకు కష్టాన్ని ఇచ్చినా కానీ నష్టాన్ని మాత్రం కలిగించడు. విశాఖ నాలుగో పాదం వారికి సాధన

తార అయ్యింది. పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనూరాధా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి . జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది అందుచేత శుభఫలితాలు పొందగలుగుతారు.

పరిహారము :- గురునకు శనగలు దానం చేస్తే చాలా మంచిది. సుందరకాండ పారాయణ గానీ లేదా హనుమత్ కవచంగానీ పారాయణ చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి. మూడవ తేదీన శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్తోత్రము పారాయణ చేయండి.

ధనూరాశి :- వారం మధ్యలో బుధ చంద్రుల అనుకూలతతో ధన లాభం ఉంది. కాని ఈ రాశివారికి ఈ వారం చాలా అననుకూలం అని చెప్పవచ్చు. గ్రహాలన్నీ పుర్తిగా ప్రతికూల స్థితిలోకి చేరుకున్నాయి. చంద్రుడు సైతం మానసిక ఆందోళన కలిగించి అనారోగ్య హేతువు అవుతున్నాడు. కేతువు బుధుడు మాత్రమే మీకు మంచి ఫలితాల్ని ఇవ్వనున్నారు. రవి, శనులు ఇద్దరు అనారోగ్య కారకులు అవుతున్నారు. ఇక శుక్రుడి ప్రభావం చేత నీలాపనిందలు భరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మీ మీద మీకు ఉండే ఆత్మవిశ్వాసము, వాక్చాతుర్యంతో బయట పడాలన్నా సంకల్పంతో ఉండండి. గురుడు మీకు స్థాన చలనాన్ని కలిగిస్తున్నాడు. అయితే అతను స్వక్షేత్ర వర్తి కావడం వల్ల మార్పు కూడా మంచికే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సమస్యలను దైవానుగ్రహం తప్ప మరేదీ తొలగించలేదు అన్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

భగవంతుని యందు నమ్మకముతో ఏకాగ్రతా సాధన చెయ్యండి మీకు అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. మూల నక్షత్ర జాతకులకు విపత్ తారయింది. ప్రతికూలతలు ఎక్కువ. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సంపత్తారయింది మంచి ఫలితాల్ని పొందగలుగుతున్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది అనారోగ్య సూచన.

పరిహారం :- రుద్రాభిషేకం అన్ని ఇబ్బందుల్ని తొలగించేస్తుంది. నవగ్రహ దర్శనం వీలయితే ప్రతిరోజూ చేయండి.

మకర రాశి :- ఈ రాశివారికి బుధ రాహువులతోపాటు కుజడు అనుకూలంగా ఉండటం చేత చేపట్టిన పనులలో కొన్ని మాత్రం తప్పక నెరవేరుతాయి. బంధు మిత్రల వల్ల, స్నేహితులను కలవడం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు. మీకు గురు బలం తక్కువగా ఉండటం చేత మీరు ప్రతి పనిలోనూ సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. అయితే బుధుడు ఏదో ఒక రకమైన మంచి చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. జీవిత భాగస్వామి కారణంతో మీరు ఇతర వ్యక్తులతో మాట పడే అవకాశం ఉంది. అందుకు శుక్ర గ్రహ స్థితి కారణం తప్ప మరేదీ కాదు. ఏది ఏమైనప్పటికీ నీ సొంత నిర్ణయాలు మాత్రమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కుటుంబంలోని చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారంలో మీకు అననుకూలత ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకున్నారు కాబట్టి ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండండి. లగ్నంలో శని కూడా మీకు శారీరక దుర్బలత్వాన్ని సూచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దైవ బలం మాత్రమే మీకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మతార కావున అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. శ్రవణనక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది మంచి ఫలితాలని పొందగలుగుతున్నారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి మిత్ర తార అయ్యింది. శుభ సూచనలు ఉన్నాయి.

పరిహారం:- శనికి జపము నువ్వుల దానము, ప్రతి రోజు నవగ్రహ ప్రదక్షిణలు, రుద్రాభిషేకము మంచి ఫలితాల్ని ఇస్తాయి .

కుంభ రాశి :- ఈ రాశివారికి ఈ వారం గురు బలం లాభిస్తుంది. మానసికంగా మీరు ఎంత దుర్బలులై ఉన్నప్పటికీ రవి గ్రహ కారకత్వం వల్ల శత్రువులు నశిస్తారు. శత్రుభావం తుడిచిపెట్టుకుపోతుంది.

బంధు దర్శనము, స్త్రీ సౌఖ్యము ఉత్సాహంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అయితే అనారోగ్య భయమూ మృత్యు భయమూ మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాయి. మీకు కుజగ్రహ ప్రతికూలత వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు చవి చూస్తారు. బుధుడు కూడా దానికి, సహకరిస్తూ ఉన్నాడు. గురు శుక్రుల ప్రభావం చేత మాత్రమే మీకు మీ వారం ఆశాజనకంగా ఉంటుంది. అదే స్స్థితి మీకు కొనసాగాలి అంటే వారిని ప్రార్థించడమే ఉత్తమమైన మార్గం. వ్యయం లో శని మీకు ఇబ్బందులు, కష్టాలు కలిగిస్తాడు. యోగ్యుడైన గురు చరణములు పట్టుకున్నప్పుడు మాత్రమే మీరు సన్మార్గంలో ముందుకు వెళ్లగలుగుతారు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి మిత్రతార అయింది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు నైధనతార అయ్యింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తార అయ్యింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

పరిహారం :- నవగ్రహ దర్శనము మంచిది. శివునకు రుద్రాభిషేకం చేయించండి. అమ్మవారి ప్రార్థనలు మీకు మంచి మార్గంలో నడిపిస్తాయి.

మీన రాశి :- ఈ రాశివారికి ఈవారం శుక్ర శనులు యోగిస్తారు. మీరు ఆర్ధికంగానో మానసికంగానో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుటుంబంలోని స్త్రీల ద్వారా లాభాన్ని పొందుతారు. బయటకు కనబడని చెప్పుకోలేని, భయాలు మిమ్మల్ని ఆవరించి కష్టాల్ని శ్రమల్ని కలిగిస్తాయి. గురు బుధ కుజ గ్రహాల అనుగ్రహం తగ్గడమే దీనికి కారణం. శని రాజ్యంలో ఉండి, స్వ క్షేత్ర వర్తి కావడంవల్ల ధన లాభాలు సూచించినప్పటికీ జన్మతః శని పాపి కావడంవల్ల మీరనుకున్నది సాధించడం కాస్త ఇబ్బంది గానే ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ, రాజకీయ వ్యవహారాల్లో పూర్తి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని గూర్చి ఆలోచించేవారు తగ్గిపోతారు. ఎవరు లేని ఒంటరి అనే భావం మీకు కలిగినప్పటికీ బుధ గ్రహ స్థితి శత్రువుల పై జయాన్ని ఇస్తుంది. శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆచితూచి మాట్లాడటం వల్ల, నేర్పుగా వ్యవహరించడంవల్ల మీ పనులు సానుకూలమవుతాయి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సాధన తార అయింది అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- ఖడ్గమాలా పారాయణం చేయండి రుద్రాభిషేకాలు చేయించండి. మంగళవారం నియమాన్ని ఎక్కువగా పాటించండి మంచి ఫలితాలను పొందగలుగుతారు.

Next Story