రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి జీవిత ఖైదు

By సుభాష్  Published on  28 Feb 2020 3:53 PM GMT
రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి జీవిత ఖైదు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. 2018 అక్టోబర్‌ నెలలో నడిరోడ్డుపై రమేష్‌ అనే వ్యక్తిని విక్రమ్‌, లక్ష్మణ్‌, కిషన్‌ అనే వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. 2017 డిసెంబర్‌ 24న రాత్రి సమయంలో మహేష్‌ను రమేష్‌, అతని స్నేహితులు కలిసి దారుణంగా హత్య చేశారు. కాగా, రమేష్‌, మహేష్‌లు ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన వివాహితతో రమేష్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో ఆమెతో మహేష్‌ కూడా చనువుగా ఉండేవాడు. ఈ విషయమై మహేష్‌, రమేష్‌ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదే సమయంలో వివాహిత భర్తకు విషయం తెలిసి అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోయారు. దీంతో మహేష్‌పై కోపం పెంచుకున్న రమేష్‌.. మహేష్‌ను నమ్మించి కారులో తీసుకెళ్లి హత్య చేశాడు. తర్వాత కారును సర్వీసింగ్‌కు ఇవ్వడంతో కారులో ఉన్న రక్తపు మరకలను గమనించిన సర్వీసింగ్‌ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహేష్‌ హత్య విషయం బయటకు వచ్చింది.

ఇక కేసులో ప్రధాన నిందితుడైన రమేష్‌ తరచూ కోర్టుకు హాజరవుతూ వస్తుండేవాడు. రమేష్‌పై కోపం పెంచుకున్న మహేష్‌ తండ్రి కిషన్‌.. రమేష్‌ కోర్టు నుంచి వస్తుండగా, అత్తాపూర్‌లోని పిల్లర్‌ నెంబర్‌ 143వద్ద రమేష్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. హత్య అనంతరం మహేష్ తండ్రి కిషన్‌ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో హత్యకు సంబంధమున్న కిషన్‌తో పాటు లక్ష్మన్‌, విక్రమ్‌లపై కేసు నమోదైంది. కాగా, ఈ రోజు కోర్టులో విచారణ జరుగగా, ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

Next Story