శ్రీ ప్లవనామ సంవత్సర (2021-2022) ఫ‌లాలు

Plava Nama Samvatsaram. శ్రీ ప్లవనామ సంవత్సర (2021-2022) రాసి ఫలాలు ఏ రాసి వారికీ ఎలా ఉంటుంది.

By Medi Samrat  Published on  12 April 2021 11:01 AM GMT
New year astrology

మేష రాశి :

ఆదాయం 8 వ్యయం 14

రాజపూజ్యం 4 అవమానం 3

గురుడు ఈ సంవత్సరమంతా 11 వ యింట, శని సంవత్సరమంతా 10వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు ద్వితీయ మందు, కేతువు అష్టమమందు తదుపరి రాహువు జన్మమందు కేతువు సప్తమమందు. ఈ సంవత్సరము మహోన్నత కాలం సాంఘికంగా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. వృత్తి వ్యాపారములలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మీ మాటకు ఎదురు లేదు. ఎంతటి కార్యమైనా సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత, గృహంలో శుభకార్యాలు, గృహ నిర్మాణము, స్త్రీలాభం, సౌఖ్యం, సంఘంలో ఉన్నత స్థితి, మంచి హోదా కలిగి జీవిస్తారు. అయితే హామీలు ఉన్న కారణంగా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యములలో స్త్రీ లతో విరోధము, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ వారికి స్వల్ప రాణింపు. రాహుకేతువులు వల్ల లబ్ధి తక్కువ, కష్టం ఎక్కువ. ఆందోళన, భయం పెరుగుతుంది

వృషభ రాశి:

ఆదాయం 2 వ్యయం 8

రాజపూజ్యం 7 అవమానం 3

గురుడు ఈ సంవత్సరం అంతా 10వ యింట, శని సంవత్సరమంతా 9 వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు జన్మము నందు, కేతువు సప్తమము నందు, తదుపరి రాహువు 12 వ యింట, కేతువు 6 వ యింట. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి లాభమే. వృత్తి వ్యాపారము నందు రాణింపు, ఆదాయ వృద్ధి, కుటుంబసౌఖ్యం, ధైర్యంతో ముందుకు పోగలరు. వాహన సౌఖ్యం, బంధుమిత్రులతో సఖ్యత, సంతాన సౌఖ్యం, శత్రువులపై విజయం, స్త్రీ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత కలుగును. జన్మ రాహువు వలన స్వల్ప విరోధములు,అనారోగ్యము కలుగును. సంతాన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్త్రీ లకి అనుకూలంగా ఉంది. పై అధికారులతో మాట పట్టింపులు త్వరగానే అధిగమిస్తారు. సోదర వర్గంతో అంటి ముట్టనట్టు గా ఉంటారు. దుష్ట మనస్తత్వం ఉన్న వారు ఈ రాశి వారికి తమకు తాముగా దూరం అవుతారు.

మిధున రాశి:

ఆదాయం 5 వ్యయం 5

రాజపూజ్యం 3 అవమానం 6

గురుడు ఈ సంవత్సరం అంతా 9వ యింట, శని సంవత్సరమంతా అష్టమము నందు, ఫిబ్రవరి 6 వరకు రాహువు 12వ యింట, కేతువు 6వ యింట, తదుపరి రాహువు 11వ యింట, కేతువు 5 వ యింట. శని రాహువుల వలన కొన్ని ఇబ్బందులు తప్పవు. ఏ పని కలిసిరాదు. స్థానచలనం, గృహ మార్పులు, వ్యాపార మార్పులు, వృత్తిరీత్యా నష్టములు, సోదర విరోధములు, మిత్రుల వలన నష్టపోవటం, ఆరోగ్య భంగములు, వాహన ప్రమాదములు, భార్యా భర్తల మద్య విరోధములు, ప్రభుత్వం మూలక ఇబ్బందులు, పోలీసు కేసులలో ఇరుక్కొనుట జరుగును. సంవత్సరం మధ్యలో కోపాన్ని నియంత్రించలేక ఆర్థిక లావాదేవీలలో సమస్యలు తెచ్చుకుంటారు. ప్రాబల్యం తగ్గుతుంది. బదిలీలు ప్రమోషన్లు ఉన్నా వాటి ద్వారా కలిగే సంతోషం తక్కువ. మొత్తంమీద ఆదాయ వ్యయాలు రెండు సమానం కాబట్టి సమయస్ఫూర్తితో, చాకచక్యంతో రోజులు నెట్టుకొని విజయ పంధాలో కొనసాగుతారు.

కర్కాటక రాశి :

ఆదాయం 14 వ్యయం 2

రాజపూజ్యం 6 అవమానం 6

గురుడు ఈ సంవత్సరం అంతా అష్టమము నందు, శని సంవత్సరమంతా సప్తమము నందు, ఫిబ్రవరి 6 వరకు రాహువు 11వ యింట,కేతువు 5 వ యింట, తదుపరి రాహు వు 10 వ యింట, కేతువు 4వ యింట. ఈ సంవత్సరము మిశ్రమ ఫలితం గా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారము నందు బాగున్నప్పటికీ ఆశించినంత మేరకు లాభములు పొందలేరు. భాగ్య నష్టము, వ్యవహార నష్టము, దేహ కష్టం, శారీరిక శ్రమ ఉంది. రాజకీయ, సామాజిక, వైద్య, విద్య, నర్సరీ, వ్యవసాయ రంగానికి పూర్తిగా అనుకూలం. రోగ బాధలు ఉపశమిస్తాయి. కుటుంబంలో వివాదాలు చాపకింద నీరులా ఉంటాయి. శక్తికి మించిన కార్యాలను చేపడతారు. గృహ స్థానం మార్పులు ఉన్నాయి. కోపం నియంత్రించుకోవాలి. విమర్శలకు ప్రతిఘటిస్తారు. కీలక నిర్ణయాలు లాభిస్తాయి. ఆప్తమిత్రుల అండదండలు లభిస్తాయి. శాంత స్వభావంతో అనుకూలతలను పొందుతారు. రాహు ప్రభావంతో మేలైన లబ్ధి. కోర్టు తీర్పులు అనుకూలిస్తాయి. శుభకార్య పరంపర కొనసాగుతుంది.

సింహరాశి :

ఆదాయం 2 వ్యయం 14

రాజపూజ్యం 2 అవమానం 2

గురుడు ఈ సంవత్సరమంతా సప్తమము నందు, శని ఈ సంవత్సరమంతా 6 వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు 10 వ యింటా కేతువు 4వ యింట. తదుపరి రాహువు 9 వ యింట, కేతువు 3 వ యింట. ఈ సంవత్సరం మంచి యోగ దాయకం. ఏ పని అయినా త్వరగా పూర్తవుతుంది అన్నింటా విజయం. ఆర్ధికంగా పరిపుష్టి. వ్యాపారాదులందు ఎంతో ఉత్సాహం, ప్రోత్సాహం. నూతన ఆస్తులను కొంటారు. గృహంలో శుభకార్యములు, ధైర్యసాహసములు పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధం లావాదేవీలు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలము. సంతాన సౌఖ్యం. ఆదాయానికి ఏడు రెట్లు వ్యయం కావడం వల్ల లోలోపల భయం ఆందోళన పెరుగుతుంది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కానీ పరోక్షంగా లబ్ది పొందుతారు. తరచుగా సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుత్సాహం వలన నిరాడంబర జీవితం గడపాలని కోరుకుంటారు. జీవనోపాధికి లోటు ఉండదు. అపనిందలు క్రమంగా తగ్గుతాయి. ఊహించని సమస్యలు, సంతానం వల్ల కొన్ని నష్టాలు కలిగినా తట్టుకుని నిలబడి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు కలిసివస్తాయి.

కన్యారాశి :

ఆదాయం 5 వ్యయం 5

రాజపూజ్యం 5 అవమానం 2

గురుడు ఈ సంవత్సరమంతా 6 వ యింట, శని ఈ సంవత్సరమంతా 5వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు 9 వ యింటా కేతువు 3వ యింట. తదుపరి రాహువు 8వ యింట, కేతువు 2వ యింట. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి ప్రోత్సాహం. ఆదాయం బాగుండును. వ్యాపారం మెరుగుపడుతుంది. స్థలం లేదా గృహం కొంటారు. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబంలో వ్యక్తుల సహకారము లభిస్తుంది. వాహన సౌఖ్యం కలుగును. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంనప్పటికీ వ్యయం అనేది అవసరమైన ఖర్చుగానే ఉండి స్థిరాస్తిని తలవని తలంపుగా అభివృద్ధి చేస్తారు.. ప్రాబల్యం పెరుగుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి పొందుతారు. సోదర వర్గంతో విభేదాలు జరుగుతాయి. అధికారులతో మన్ననలు, స్వేచ్ఛా జీవితం, పెద్దలతో పరిచయాలు, వినోద వస్తువుల సేకరణ, స్వర్ణాభరణ ప్రాప్తి, కుటుంబసౌఖ్యం కలుగుతాయి. సమయస్ఫూర్తితో జీవనం సాగిస్తారు. అవివాహితులు, నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉంటారు. శత్రు విజయం ఉంది.

తులారాశి :

ఆదాయం 2 వ్యయం 8

రాజపూజ్యం 1 అవమానం 5

గురుడు ఈ సంవత్సరమంతా 5 వ యింట, శని ఈ సంవత్సరమంతా 4వ యింట, అంటే అర్థాష్టమము నందు, ఫిబ్రవరి 6 వరకు రాహువు 9 వ యింటా కేతువు 3వ యింట. తదుపరి రాహువు 8వ యింట, కేతువు 2వ యింట. అర్ధాష్టమ శని అయినప్పటికీ గురు బలం వల్ల యోగ ప్రాబల్యం. ఏ కార్యామైనా సులభంగా పూర్తి. ఆర్థిక సమస్యలు తొలగును. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. అన్నింటా మీదే పైచేయి. వాహన లాభం, కానీ ప్రమాదం జరగవచ్చు. బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. కుటుంబ సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలుగును. ఆదాయానికి నాలుగు రెట్లు ఖర్చు ఉన్నందున ప్రారంభంలో మనస్థాపం ఉంటుంది. ఒకవైపు ఆదాయం తక్కువ , మరోవైపు అర్ధాష్టమ శని జరుగుతున్నదన్న ఆలోచనలు మనసును వేధిస్తూ ఉంటాయి. అయినా నూతన ఆర్థిక ప్రణాళికలతో అనవసర వ్యయం లేకుండా జాగ్రత్త పడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. తరచూ నిద్ర, ఆరోగ్యం భంగం కలుగుతాయి. అంతర్గత శత్రువుల బెడద అధికం. ఆలస్యంగా శుభ కార్యసిద్ధి. స్వల్ప నష్టాలు. అవినీతి కార్యాలను వ్యతిరేకిస్తారు. సంతాన అంశాలు తృప్తిని ఇస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విజయానికి చేరువవుతారు.

వృశ్చిక రాశి :

ఆదాయం 8 వ్యయం 14

రాజపూజ్యం 4 అవమానం 5

గురుడు ఈ సంవత్సరమంతా 4 వ యింట, శని ఈ సంవత్సరమంతా 3వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు 7 వ యింటా కేతువు జన్మమందు. తదుపరి రాహువు 6వ యింట, కేతువు 12వ యింట. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి బాగుంటుంది. చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సంతానం అభివృద్ధిలో ఉంటారు. పాత గృహంలో మార్పులు. శత్రువులపై ఆధిక్యం. కుటుంబ వ్యక్తులతో అవగాహన ఉంటుంది. నూతన కార్యములు లభిస్తాయి. గ్రహ సంచార స్థితులను బట్టి సంవత్సరమంతా వ్యతిరేక గ్రహస్థితులు. వ్యవహారం వల్ల ఆర్థిక అంచనాలు తారుమారు అవుతాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల అనవసర సమస్యలు పెరుగుతాయి. ప్రధాన సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోలేరు. భాగస్వామ్య నిర్ణయాలు, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విహార యాత్రలు, ఆర్భాటాలు ఆడంబరాలు శుభ కార్యాచరణ వల్ల ధనం ఖర్చు అవుతుంది. సంవత్సరం మధ్య నుంచి విజయబావుటా ఎగరవేస్తారు. శరీరానికి వైద్య సేవలు అవసరం. సహచరులతో రాజీ పడతారు. బంధుజనంతో శుభకార్యాన్ని నెరవేరుస్తారు కానీ అంతర్గత శత్రువులు ఉన్నారని గ్రహించలేరు.

ధను రాశి :

ఆదాయం 11 వ్యయం 5

రాజపూజ్యం 7 అవమానం 5

గురుడు ఈ సంవత్సరమంతా 3 వ యింట, శని ఈ సంవత్సరమంతా 2వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు 6వ యింటా కేతువు 12 వ యింట, తదుపరి రాహువు 5వ యింట, కేతువు 11వ యింట. ఈ సంవత్సరం ఏలినాటి శని అయినా స్వ క్షేత్రం లో ఉండటం వల్ల అంతగా ఇబ్బంది ఉండదు. వ్యవహార జయం. చేయు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ ఆధిక్యత కొనసాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కుటుంబ విలువలు పెరుగుతాయి. బంధుమిత్రులు దూరమవుతారు. మీ మాటల్ని ఇతరులు లెక్కచేయరు. సంతానమునకు స్వల్పం గా ఇబ్బందులు తప్పవు. ఏలినాటి శని చివరి భాగంలో కాబట్టి వ్యయం కంటే ఆదాయాన్ని అధికంగా పొందుతూ, అన్యోన్యత తో, ఇష్ట కార్యసిద్ధి తో, ఆరోగ్యంగా ఆనందముగా శుభసంకల్పంతో సంవత్సరాన్ని గడుపుతారు. స్థానచలన భయంగానీ, ప్రాణభయం కానీ ఉండవు. సోమరితనం పెరుగుతుంది. ప్రతి విషయంలో ముందువెనుకలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రుణదాతల వత్తిడి ఉండదు.

మకర రాశి:

ఆదాయం 14 వ్యయం 14

రాజపూజ్యం 3 అవమానం 1


గురుడు ఈ సంవత్సరమంతా 2 వ యింట, శని ఈ సంవత్సరమంతా జన్మమందు , ఫిబ్రవరి 6 వరకు రాహువు 5వ యింటా, కేతువు 11 వ యింట, తదుపరి రాహువు 4వ యింట, కేతువు 10వ యింట. ఈ సంవత్సరం ఏలినాటి శని అయినప్పటికీ గురు రాహు బలం వల్ల యోగ ప్రాబల్యం అధికం. మీ మాటకు ఎదురుండదు. ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. ఆరోగ్య లాభం. బంధుమిత్రుల సహకారం. గృహంలో శుభకార్యములు, స్వగృహ నిర్మాణం, సంతానం స్థిరత్వం పొందుట. శత్రువులపై విజయం. స్త్రీ లాభం. ఆదాయ వ్యయములు రెండూ పోటాపోటీగా ఒకేలా ఉన్నాయి. రెండవ భాగం ఏలినాటి శని వలన అనారోగ్యం ఏర్పడి డబ్బు ఖర్చు అగును. అయినప్పటికీ మేలైన ఆరోగ్యం పొందుతారు. జన్మశని పట్టినందున ఆస్పత్రి పాలయ్యాము అనుకోవటం పొరపాటు. మరిన్ని సంవత్సరాలు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా తిరగటానికి శాస్త్ర చికిత్సలు అవసరం. ఎదుటి వారిపై ఆవేశం ఎక్కువ. వివాదాలు నిదానంగా పరిష్కారమవుతాయి. పొదుపు సొమ్మును ఖర్చు పెడతారు. ఆర్థిక మాంద్యం తట్టుకొని నిలబడతారు. రుణ సమస్యలు తగ్గుతాయి. కష్టంతోనే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయ ప్రాప్తిని పొందుతారు.

కుంభ రాశి:

ఆదాయం 14 వ్యయం 14

రాజపూజ్యం 6 అవమానం 1

గురుడు ఈ సంవత్సరమంతా జన్మమందు, శని ఈ సంవత్సరమంతా 12 వ యింట, ఫిబ్రవరి 6 వరకు రాహువు 4వ యింటా, కేతువు 10వ యింట, తదుపరి రాహువు 3వ యింట, కేతువు 9వ యింట. ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్థిరత్వం కోల్పోవుట, మందబుద్ధి పనులయందు ఆటంకములు, ప్రభుత్వ మూలంగా ఇబ్బందులు, కోర్టు వ్యవహారములలో అపజయం. పోలీసులు కేసులలో ఇరుక్కోనుట, కుటుంబ వ్యక్తులతో విరోధములు, జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. సంఘంలో అగౌరవం ఎదుర్కొంటారు. హాస్యానికి దూరంగా ఉండాలి. రావలసిన బాకీలు ఆలస్యం అగును. అధర్మ కార్యాల వైపు ఆసక్తి పెరుగుతుంది. వివేకంతో బంధువులతో మెలగండి. మీ బాధాకరమైన అంశాలపై న్యాయస్థానాలు జోక్యం ఉండును. సాహస నిర్ణయాలు పై ఆసక్తి పెరుగుతుంది. ఎదుటి వారిని హేళన చేసిన కారణంతో మిత్రత్వం దూరమవుతుంది. ఆవేశాలు తగ్గితేనే ప్రతిష్ట పెరుగుతుంది. ఉపాధి ఆలోచనలు ఆలస్యమై పోతాయి. వ్యూహాత్మ కం నిర్ణయాలు చెయ్యలేరు. వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. ఆదాయాన్ని పెంచే ఆలోచనలకు బంధములు ఏర్పడును. ప్రతిబంధక అంశాలను వాయిదా వేయలేరు.

మీన రాశి:

ఆదాయం 11 వ్యయం 5

రాజపూజ్యం 2 అవమానం 4

గురుడు ఈ సంవత్సరమంతా 12 వ యింట , శని ఈ సంవత్సరమంతా11 వ యింట , ఫిబ్రవరి 6 వరకు రాహువు 3వ యింటా, కేతువు 9వ యింట, తదుపరి రాహువు 2వ యింట, కేతువు 8వ యింట. ఈ సంవత్సరము అంతా శని బలీయంగా ఉన్నందున ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధించగలరు. మీ పట్టుదల, సాహసం హెచ్చును. మానసికంగా ఉత్తేజ వంతులు అవుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. అయినప్పటికీ ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. సంతాన సౌఖ్యం, కుటుంబ వ్యక్తులతో సఖ్యత, స్వయంకృత అపరాధము వలన కొన్ని అవమానాలు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యయం కంటే ఆదాయం రెట్టింపు ఉన్నందున ఆనందోత్సాహాలతో గడుపుతారు. నూతన ప్రణాళికలు వేస్తారు. వివాహాది శుభకార్యాలు కలిసివస్తాయి. నూతన వ్యాపార తలంపులు, కుటుంబసౌఖ్యం, సంతాన సౌఖ్యం ఉంటూ మానసిక ఆనందంతో ఉంటారు. స్థిరాస్తుల లో అనుకూల మార్పులు ఉంటాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్ధలు తగ్గును. అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ మీ లావాదేవీల చే వ్యతిరేక వార్తలు ఉంటాయి. రాజకీయ రంగానికి అనుకూలం ఒక్కోసారి అశాంతితో తీసుకొన్ననిర్ణయం కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఎదుటివారిని మాటలతో ఆకట్టుకొని ఆధిపత్యం చెలాయిస్తున్నారు.




Next Story