ఇవాళ చంద్రగ్రహణం.. ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
2023 ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఇవాళ అర్ధరాత్రి సంభవించనుంది. అశ్వయుజ మాసం శరత్ పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవించనుంది.
By అంజి
ఇవాళ చంద్రగ్రహణం.. ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
2023 ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఇవాళ అర్ధరాత్రి సంభవించనుంది. అశ్వయుజ మాసం శరత్ పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ నెల 28న అర్ధరాత్రి 1:06 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. మొత్తం గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని.. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని అర్చకులు చెబుతున్నారు. దీనిని పాక్షిక చంద్రగ్రహణం అని కూడా అనవచ్చు. పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో చివరి చంద్ర గ్రహణం భారతదేశం సహా పలు దేశాల్లో కనిపిస్తుంది. ఇక చంద్రగ్రహణం యొక్క సూతక్ కాలం 9 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఆ సమయంలో కొన్ని పనులు చేయొద్దని చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 29 తెల్లవారుజామున 02:22కు చంద్రగ్రహణం ముగియడంతో సూతకాల కాలం ముగుస్తుంది. సూతక్ కాలాన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు. అందుచేత అందులో ఎలాంటి శుభ కార్యాలు చేయరు.
చంద్రగ్రహణం యొక్క సూతకం ప్రారంభమైన వెంటనే ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో ఎలాంటి పూజలు, పారాయణాలు చేయరు. సూతక్ కాలంలో, మీరు మీ ఇష్టమైన దేవత పేరును గుర్తుంచుకోవచ్చు లేదా మంత్రాన్ని జపించవచ్చు. సూతకాల సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు. ఎందుకంటే ఈ సమయం అపవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు. చంద్రగ్రహణం సమయంలో వండటం, తినడం రెండూ చేయకూడదట. చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా, మీ ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఒక నమ్మకం ఉంది.
చంద్రగ్రహణం యొక్క సూతకాల సమయంలో నిద్రించడం మంచిది కాదట. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారు ఇంటి నుండి బయటకు రాకూడదు. సూది, కత్తి మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల పిండం మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే నమ్మకం ఉంది. హిందువుల విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అంతేకాదు దుస్తులు నేయడం, నూలు వడకడం వంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో దానధర్మాలు ఎవరైతే చేస్తారో వారికి అనేక ఫలితాన్ని పొందుతారని, వారు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవిస్తారట. చంద్రగ్రహణం ముగిసిన తరువాత నది స్నానం చేయాలి. లేదా తీర్థయాత్రకు వెళ్లాలి లేదా ఇంట్లో ఉన్న నీటిలో గంగాజలాన్ని జోడించి స్నానం చేయాలని పెద్దలు చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని న్యూస్‌మీటర్ తెలుగు ధృవీకరించడం లేదు.