జ్యోతిష పరిహారాలు ఆటంకాలను తొలగిస్తాయా?.. ఇవి తెలుసుకోండి
గ్రహ దోషాల వల్ల కొన్నిసార్లు మన శ్రమకు తగిన ఫలితం దక్కదు. అలాంటప్పుడు జ్యోతిష పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు.
By - అంజి |
జ్యోతిష పరిహారాలు ఆటంకాలను తొలగిస్తాయా?.. ఇవి తెలుసుకోండి
గ్రహ దోషాల వల్ల కొన్నిసార్లు మన శ్రమకు తగిన ఫలితం దక్కదు. అలాంటప్పుడు జ్యోతిష పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేక పూజలు చేయాలంటున్నారు. 'ఇవి మనలోని ప్రతికూలతలను తొలగించి, మానసిక ధైర్యానిస్తాయి. గ్రహ స్థితి వల్ల కలిగే ఒత్తిడిని అరికడతాయి. కెరీర్ అడ్డంకులను తొలగిస్తాయి. లక్ష్య సాధనకు తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి' అంటున్నారు.
కెరీర్, ఉద్యోగ అడ్డంకులా?
చాలా మంది తమ సామర్థ్యానికి తగిన ఉద్యోగం లభించక, ఉన్న ఉద్యోగంలో ఆశించిన స్థాయికి ఎదగక సతమతమవుతుంటారు. జాతకంలో సూర్యుడు, శని గ్రహాల స్థితి బలహీనంగా ఉండటం వల్ల అలా జరుగుతుంది. దీనికి పరిహారంగా రోజూ ఉదయం సూర్యునిని నీటిని అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం ఆదిత్య హృదయం పఠించాలి. శనివారం పేదలకు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, గుర్తింపు వస్తుంది. వృత్తిపరమైన చిక్కులు క్రమంగా తొలగి, కెరీర్ పుంజుకుంటుంది.
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే?
ఎంత కష్టపడి సంపాదించినా కొందరి చేతిలో డబ్బు నిలవదు. శుక్ర, గురు గ్రహ అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల అలా జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవీ పూజ, కనకధారా స్తోత్ర పఠనం చేయాలని సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక స్థితి మెరుగుపడి అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందట.
వయస్సు పెరిగినా వివాహం జరగట్లేదా?
పెళ్లీడు వచ్చినా సంబంధాలు కుదరకపోవడం చివరి నిమిషంలో క్యాన్సల్ కావడం వంటి సమస్యలు నేటి కాలంలో అధికమయ్యాయి. దీనికి కుజ, గ్రహ దోషాలే కారణమంటున్నారు జ్యోతిష నిపుణులు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటున్నారు. అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తే వివాహ ఆటంకాలు తొలగుతాయట. గురువారం రోజున ఆవుకు శనగలు, అరటిపండ్లు తినిపిస్తే.. గురుగ్రహ అనుగ్రహం కలికి త్వరగా వివాహం నిశ్చయం అవుతుందని సూచిస్తున్నారు.